ఏపి అక్రమ ప్రాజెక్టులపై పోరు

చుక్క నీటిని వ‌దులుకోం : మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ 
మహబూబ్‌న‌గ‌ర్, అక్షిత బ్యూరో :

రాష్ట్రానికి వచ్చే కృష్ణ, తుంగభద్ర నీటిలో చుక్క నీటిని కూడా వదలుకోమని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పక్క రాష్ట్రం ఏపీ అక్రమ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా, తుంగభద్ర నీటిని తరలిస్తే ఊరుకోబోమని, రాష్ట్రానికి అది ముఖ్యంగా పాలమూరు జిల్లాకు వచ్చే నీటిలో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అన్నారు. మంగళవారం మహబూబ్‌న‌గ‌ర్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ల‌బ్దిదారులు 96 మందికి రూ. 86 లక్షల విలువ చేసే చెక్కులను మంత్రి పంపిణీ చేవారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్ర‌త్యేక‌ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్ర‌భుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందన్నారు.
గతంలో విద్యుత్తు, సాగు నీరు, రహదారులు ఇలా ఎన్నో సమస్యలు ఉండేవన్నారు. పేదలు అప్పులు చేసి పెళ్లిళ్లు చేసుకొనే వారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా పేదలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నద‌న్నారు. రైతు బంధు, రైతు బీమా కింద పెట్టుబడి ఇస్తున్నామని తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. అదేవిధంగా కృష్ణా నీటిని పాలమూరు- ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపి వ్యవసాయం చేసేందుకు కృషి చేస్తుండగా పక్క రాష్ట్రం అక్రమంగా నీటిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నదని దుయ్య‌బ‌ట్టారు. సాగునీటి కోసం అవ‌స‌ర‌మైతే పోరాటం చేస్తాంగానీ చుక్క నీటిని కూడా వదులుకోమని పునరుద్ఘాటించారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి సొంత జాగా ఉంటే ఇళ్లు కట్టిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కెసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్ష్యులు రాజేశ్వర్ గౌడ్, స్థానిక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *