అమరుల త్యాగాలతో పయనం

అమరవీరుల వారసత్వంతో పార్టీని ముందుకు తీసుకు పోవాలి
-జూలకంటి
మునగాల, అక్షిత న్యూస్ : ప్రజాసమస్యలపై పోరాటం చేయడమే కమ్యూనిస్టుల లక్ష్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.మునగాల మండలం నర్శింహులగూడెం గ్రామంలో ప్రజల కొరకు ప్రాణాలిచ్చిన అమరవీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని,ప్రజా సమస్యలే ఏజెండాగా తీసుకొని పని చేసి సిపిఎం పార్టీని అభివృద్ధి చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామంలో ఆదివారం సీపీఎం గ్రామశాఖ నాయకులు పిడమర్తి అబ్రహం అధ్యక్షతన గ్రామ శాఖా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ సిపిఎం గ్రామశాఖ మహాసభలకు సిపిఎం పార్టీ అభివృద్ధి,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ఎజెండా తప్ప మరో ఎజెండా లేదని పేర్కొన్నారు. ఎర్రజెండా అధికారంలో ఉన్నటువంటి దేశాల్లో నిరక్షరాస్యత తొలగిపోయి పూర్తి అక్షరాస్యతను సాధించిందని తెలిపారు.భూతద్దం పెట్టి వెతికినా నిరుద్యోగులు, పేదలు,బిచ్చగాళ్ళు లేరని అన్నారు. కమ్యూనిస్టు దేశాల్లో అందరికీ విద్య అందరికీ వైద్యం ఉచితంగా అందజేస్తున్నారని, అందుకే అక్కడ ఎలాంటి విపత్తులు వచ్చినా భయపడకుండా అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. అలాంటి సమాజం మన దేశంలో తీసుకురావడం కోసం పోరాటం చేయడంలో సిపిఎం పార్టీ అగ్రభాగంలో ఉందన్నారు.గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో,రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించిన అందువల్లనే అధికారం కోల్పోయిందన్నారు.  ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను మూలంగా వ్యవసాయ రంగం దివాలా తీస్తుందని పేర్కొన్నారు. గత సంవత్సర కాలం నుండి దేశం కొంతమంది పెట్టుబడిదారులు మాత్రమే కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిలు,వంటగ్యాస్ ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్ శక్తులకు రాయితీలు కల్పించడం దుర్మార్గమైన చర్యని దుయ్యబట్టారు.కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు బుద్ది చెప్పే విధంగా ప్రజలు సిద్ధం కావాలన్నారు. మునగాల పరగణా ఈ ప్రాంతంలో నర్శింహులగూడెం గ్రామంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అన్యాయాలకు పట్టుకొని పోరాడటం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోగా రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా వాగ్దానాల మీద వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.

ప్రజల యొక్క భవిష్యత్తును మార్చే విధానాలను రూపొందించడంలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని అన్నారు. ఈ మహాసభలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మీ,సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు,సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపీ,మండల కార్యదర్శి దేవరం వెంకటరెడ్డి,ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంపాల స్వరాజ్యం, మేకన బోయిన సైదమ్మ,రైతు సంఘం నాయకురాలు కొప్పుల రజిత,పిఏసీఎస్ చైర్మన్ చందా చంద్రయ్య,కోధాడ పట్టణ,అనంతగిరి మండల కార్యదర్శులు మిట్టగడుపుల ముత్యాలు,రాపోలు సూర్యనారాయణ గ్రామ కమిటీ కార్యదర్శి జులకంటి కొండారెడ్డి,మాజీ ఎంపీటీసీ జులకంటి విజయలక్ష్మి,మండల కమిటీ సభ్యులు సైదా,స్వరాజ్యం, వెంకటరెడ్డి,కృష్ణా రెడ్డి,శాఖ కార్యదర్శులు మారం వెంకటరెడ్డి, సోమపంగు గుర్వయ్య,సైదమ్మ, తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *