రైతు వేదికలు కర్షక దేవాలయాలు

రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే వేదికలు
వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు దోహదం
 వేములపల్లిలో రైతు వేదిక భవనం ప్రారంభం

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వేములపల్లి, అక్షిత ప్రతినిధి : రైతు వేదికలు కర్షక దేవాలయాలుగా బాసిల్లుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. రైతు వేదికల నిర్మాణాల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావొచ్చని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండల కేంద్రంలో రూ.3 కోట్ల 50 లక్షల నిధులతో నిర్మించనున్న కేజీబీవీ భవనానికి భూమి పూజ చేయడంతో పాటు నూతన రైతు వేదిక భవనాన్ని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే 2014 కు ముందు ఆ తర్వాత అనే అంశాన్ని గమనంలోకి తీసుకోవాలని సూచించారు. నీళ్లు ,పెట్టుబడి,ధర నిర్ణయించే అధికారమే వ్యవసాయానికి నిర్వచనంగా ఆయన అభివర్ణించారు. యావత్ భారత దేశంలో పై మూడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అమలులోకి వచ్చాయి అన్నారు. అత్యధికంగా బోర్ బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నది కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అని ఆయన తెలిపారు. వీటన్నింటిపై సంపూర్ణ అవగాహన ఉన్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ అందిస్తున్నారని ఆయన కొనియాడారు. యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా వ్యవసాయ రంగానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న దాఖలాలు లేవన్నారు.దేశాన్ని పాలిస్తున్న ప్రధాని సొంత రాష్ట్రంలో కూడా మోటర్లకు మీటర్లు బిగించి నెలవారీ విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని ఆయన ఎద్దేవాచేశారు. 2014 కు ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఫ్లోరిన్ మహమ్మారి పట్టి పీడించేదని అది ఇప్పుడు మటుమాయం అయిందని ఆయన తెలిపారు. ఇది నేను చెబుతున్న విషయం కాదని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఏజెన్సీలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విషయం మీద చర్చ పెట్టి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని అనుకున్న ఆయనకు మొదట గుర్తుకు వచ్చేది ఉమ్మడి నల్లగొండ జిల్లా మాత్రమేనని ఆయన చెప్పారు. అందులో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎదుర్కొంటున్న ఫ్లోరోసిస్ నుంచి విముక్తి చెయ్యడానికి గాను మిషన్ భగీరథ కార్యక్రమానికి అంకురార్పణ చేపట్టారని అన్నారు.అత్యధికంగా బోర్ బావుల మీద చేస్తున్న జిల్లాగా నల్లగొండ ను గుర్తించిన మీదటనే వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ను మొదలు పెట్టిన విషయాన్ని విస్మరించరాదన్నారు.ఉమ్మడి జిల్లాలో ప్రజల జీవనాధారం వ్యవసాయం అని అటువంటి వ్యవసాయం ఇప్పుడు పండుగగా మారింది అంటే ఆ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు.రైతులను సంఘటితం చేయడంతో పాటు తాము పండించిన పంటకు తామే ధర నిర్ణయించుకునే అధికారం రైతులకు ఉండాలన్న సంకల్పంతో రైతు వేదికల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలు ద్వారా స్వరాష్ట్రంలోని రైతులు కాలర్ ఎగురవేసుకొని దర్జాగా జీవిస్తున్నారని అన్నారు. ఈ రెండు పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత రైతుల బలవన్మరనాలు పూర్తిగా ఆగిపోయాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సంక్షేమం కోసం రైతు వేదికల నిర్మాణాలను చేపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు బంధు సమితి అద్యక్షులు ఇస్లావత్ రాంచందర్ నాయక్, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, ఎంఈవో బాలాజీ నాయక్, ధీరావత్ స్కైలాబ్ నాయక్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మోసిన్ అలీ, చిర్ర మల్లయ్య యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ పుట్టల భాస్కర్, కృపాకర్ రావు, మాలి ధర్మపాల్ రెడ్డి, ఎంపీపీ పుట్టల సునీత సైదులు, వైస్ ఎంపీపీ గోవర్ధన్, జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ వెంకటయ్య, మాజీ ఎంపీపీ నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికార ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *