ఆర్తులను ఆదుకోండి

హైదరాబాద్ ఎవ్వరూ రావొద్దు

వృక్చార్చనలో భాగస్వాములవ్వండి

మంత్రి కేటీఆర్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పార్టీశ్రేణులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ సహాయకచర్యల్లో పాలుపంచుకోవాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. తన జన్మదిన వేడుకలకోసం ఎవరూ హైదరాబాద్‌ రావొద్దని విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు పార్టీ శ్రేణులంతా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని శుక్రవారం సూచించారు. తన పుట్టినరోజు సందర్భంగా శనివారం ఎవరినీ కలవడం లేదని, ఈ విషయాన్ని ఎవరూ మరోలా భావించకూడదని కోరారు. రాష్ట్రంలో సామాజిక అడవుల పెంపకం కోసం విరివిగా మొక్కలు నాటాలని, ముక్కోటి వృక్షార్చనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

వానలు తగ్గాక దివ్యాంగులకు వాహనాలు

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’లో భాగంగా మంత్రి కేటీఆర్‌ తన పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు ఇస్తానని ప్రకటించిన 100 త్రిచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని వర్షాలు తగ్గుముఖం పట్టాక చేపడతారు. ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని, వాటన్నింటినీ క్రోడీకరించి, ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా వాహనాలను అందజేస్తామని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

విరాళాల వెల్లువ
మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు, కేటీఆర్‌ అభిమానులు భారీ ఎత్తున ముందుకొస్తున్నారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తనవంతుగా 105 మందికి త్రిచక్రవాహనాలు అందిస్తానని ట్వీట్‌చేశారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి 50, ఎంపీ రంజిత్‌రెడ్డి 101 వాహనాలు అందజేస్తామని ప్రకటించారు. వందలమంది దివ్యాంగులు, వారి బంధువులు తమకు ఒక త్రీవీలర్‌ విరాళం ఇవ్వాలంటూ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ వేదికగా విజ్ఞప్తిచేస్తున్నారు. ‘కేటీఆర్‌ సర్‌.. మా నాన్న మాజీ సైనికుడు. డ్యూటీ లో రెండు కాళ్లు పోగొట్టుకొన్నారు. ఆయన రోజువారీ అవసరాలకు ఒక త్రీ వీలర్‌ను అం దించి సాయం చేయండి’ అని విజయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి ట్వీట్‌ చేశారు. అందరికీ మంత్రి కేటీఆర్‌ ఓపిగ్గా సమాధానమిస్తూ తప్పకుండా సాయం చేస్తామని హామీ ఇస్తున్నారు.

కేటీఆర్‌పై డాక్యుమెంటరీ
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ మంత్రి కేటీఆర్‌ జీవితంపై రూపొందించిన ‘కేటీఆర్‌.. కింగ్‌ టు రూల్‌’ అనే డాక్యుమెంటరీని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంటరీని బందూక్‌ చిత్ర దర్శకుడు లక్ష్మణ్‌ తెరకెక్కించారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన విద్యార్థి మజ్జి కేశవ తన స్వహస్తాలతో గీసిన కేటీఆర్‌ పెన్సిల్‌ డ్రాయింగ్‌ను ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ ద్వారా కేటీఆర్‌కు పంపారు. ‘కేటీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం. నాకు వచ్చిన పెన్సిల్‌ డ్రాయింగ్‌ ద్వారా ఆయన చిన్నప్పటి నుంచి వివిధ సందర్భాల్లో ఉన్న ఫొటోలను తీసుకొని డ్రాయింగ్‌ చేశాను’ అని కేశవ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *