ఆషాడం తర్వాత ఆషాడో సెక్రెటరీకే కార్యదర్శి బాధ్యత!. 

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : కమ్యూనిస్టు పార్టీల్లో కార్యదర్శి భాద్యత అంటే ఇతర పార్టీలలో అధ్యక్షుడితో సమానం. అంతటి కీలకమైన బాధ్యతలో కూడా షాడోలు ఉన్నారంటే అతిశయోక్తి అనిపించటం సహజం. కానీ తెలుగు రాష్ట్రాల సిపిఎమ్ సమకాలీన చరిత్రలో ఇది అత్యంత సహజ సూత్రంగా మారింది.

స్వాతంత్ర్య పోరాటంలో  అనేక త్యాగాలు చేసిన నేతలు ఉన్న పార్టీ. పార్టీ చీలిన తర్వాత కూడా స్వాతంత్ర్యోద్యమ వారసత్వం స్ఫూర్తిగా పని చేస్తూ వచ్చింది. తొలితరం గతించిన తర్వాత పగ్గాలు చేపట్టిన నాయకత్వం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలకు దూరమవుతూ వచ్చింది. దాని ఫలితమే పశ్చిమ బెంగాల్, త్రిపురలో వామపక్ష ఉద్యమ దుర్గతి. ప్రత్యేకించి 35 ఏళ్లపాటు అధికారం చలాయించిన బెంగాల్ లో ఇపుడు పార్టీ ఆస్తులు కాపాడుకోలేక పోతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి అంతకన్నా ఘోరంగా తయారైంది.  ఇక మిగిలింది కేరళ మాత్రమే. అక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో చితికిలపడి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకున్నారు. ఈ పరిస్థితి దాపురించటానికి ముఖ్య కారణం అగ్ర శ్రేణి నాయకత్వం.

గత ఇరవై సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల నాయకులు అంటే సిపిఐ నారాయణ, సిపిఎం రాఘవులు సుపరిచితులు. రాష్ట్ర విభజన తరువాత ఇరువురు కేంద్ర కమిటీ బాధ్యతలు తీసుకుని ఢిల్లీ కేంద్రం గా పని చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సిపిఎమ్ కు ఆయనే పెద్ద దిక్కు. లెనిన్. మావో. మార్క్స్. అన్నీ.

గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలు సీపీఎం పార్టీకి చక్కదిద్దుతుంది బి.వి.రాఘవులేనని ఆ పార్టీ శ్రేణుల్లో బలమైన అటువంటి అభిప్రాయం. రాఘవులు లేనిదే రాష్ట్ర కమిటీ అటుంచి కార్యదర్శి వర్గ సమావేశం కూడా నడపలేని నాయకులను పార్టీ కార్యదర్శిగా ఏర్పాటు చేసుకున్నాడు. రాఘవులు ఒంటెత్తు పోకడలకు విసిగిపోయి ఒకానొక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ మెజార్టీ సభ్యులు రాఘవులు మా రాష్ట్రానికి రావద్దు అని అని చెప్పినప్పటికీ తమ్మినేని వీరభద్రంతో ముఠా కట్టి రాఘవులు  ప్రశ్నించిన వారిని అణగదొక్కి చివరికి మళ్లీ ఆయనే ఆ రాష్ట్ర ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్యదర్శిగా కొనసాగుతున్న మధు పేరుకు మాత్రమే కార్యదర్శి.  పార్టీలో ఏ నిర్ణయం చేయాలన్నా శ్రీను ని కలవండి అని చెప్పడం ఒక్కటే ఆయన చేసే నిర్మాణాత్మక పని. శ్రీను అంటే మంచి నమ్మకస్తుడు అని నిరూపించుకునేందుకు పడుతున్న పాట్లు కూడా పార్టీ శ్రేణుల పరిశీలనకు దాటిపోలేదు. రాష్ట్రం వదిలి ఢిల్లీ వెళ్లి దశాబ్దం అవుతున్నా సడెన్ ఆ శ్రీను తిరిగిరావటం వెనక ఉన్న నిర్మాణ సూత్రం ఏమిటో బోధపడక పార్టీ శ్రేణులు తలలు పట్టుకున్నాయి.

బి.వి.రాఘవులు ప్రియమైన శిష్యుడు వి. శ్రీనివాసరావు గతంలో ఢిల్లీ కేంద్రంగా పని చేసేవారు. భీమవరం రాష్ట్ర మహాసభల ముందు తాను ప్రత్యక్షంగా చక్రం తిప్పడం కంటే తన శిష్యునికి బాధ్యతలు అప్పజెప్పాలని ఢిల్లీ నుండి విజయవాడ కు సాగనంపారు. అయితే ఏకాయకిన విమానం దిగి ఏకంగా రాష్ట్ర కార్యదర్శి కుర్చీ ఎక్కడానికి చేసిన ప్రయత్నం రాష్ట్ర మహాసభలో అబాసుపాలైంది. దాంతో అలగడం, మహాసభకు పరిశీలకునిగా వచ్చిన ప్రకాష్ కారత్ ఆయన్ను బుజ్జగించటానికి రెండ్రోజులు ఆదనంగా విజయవాడలో గడపటం వంటి అనూహ్య పరిణామాలు జరిగాయి. భీమవరం మహాసభ తర్వాత మధ్యంతర సమీక్షలో కార్యదర్శి గా మధు స్థానంలో శ్రీనివాసరావును కూర్చోబెట్టాలన్న రాజీ ఒప్పందం జరిగింది. కానీ ఆ ప్రయత్నం కూడా సఫలం కాకపోవడంతో సుందరయ్య స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవం రోజున శ్రీనివాసరావు అలకపాన్పు ఎక్కాడు. నాటినుండి నేటి వరకు పేరుకు మాత్రమే మధు కార్యదర్శి గా ఉన్న అన్ని బాధ్యతలు మంచి నమ్మకస్తుడు శ్రీనుకు అప్పగించాలని ఆ విధంగా వచ్చే మహాసభల నాటికి తన నాయకత్వానికి అడ్డులేకుండా చేసుకునే ఫార్ములా తెరమీదకు వచ్చింది. అప్పటినుండి రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా శ్రీను ను కలవండి అన్నది అధికారిక మంత్రంగా మారింది.  కేంద్ర కమిటీ సభ్యుల పేరుతో రాఘవులు శిష్యుడు వి శ్రీనివాసరావు కార్యదర్శి చేయాల్సిన పనులన్నీ చక్క పెడుతున్నారు ఈయన వ్యవహారంతో జీవితాంతం పార్టీ కోసం మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పాటూరు రామయ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా వృద్ధాశ్రమానికి చేరారంటే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  దేవుడు శాసిస్తే శివాజీ పాటిస్తాడు అన్నట్టు తయారైంది ఆంధ్రప్రదేశ్ లో సిపిఎమ్ పరిస్తితి.

ఢిల్లీ నుండి బి.వి.రాఘవులు ఆదేశించాడు అంటే వి శ్రీనివాసరావు ఎంత విలువైన కార్యకర్తలు అయినా పార్టీ నుండి తొలగించడం తొలగించిన వారిపైన అవినీతి ఆరోపణలు చేయడం క్రమశిక్షణ అనే ముద్దు పేరు పెట్టడం నిరంతర యజ్ఞం గా మారింది. ఫలితంగా గడిచిన మూడు సంవత్సరాల్లో పార్టీకి అంకితమై పని చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణంలో వాళ్లు అనుసరిస్తూ వస్తున్న ఒంటెత్తు వైఖరికి కొన్ని ఉదాహరణలు ఇవి. రాష్ట్ర కమిటీ అంతా వ్యతిరేకించిన జిల్లాలను రెండు ముక్కలుగా చేసి మొత్తం పార్టీ యంత్రాంగాన్ని ఆ ప్రకారం ముక్కలు చేశారు. దానిపై ఇతవరకు సమీక్ష చేసి ఆ నిర్ణయం వలన ఏమి ప్రయోజనం జరిగిందో వివరించలేని కమిటీలు ఇపుడు ఉద్యమానికి సారధ్యం వహిస్తున్నాయి. తాజా పరిణామాల్లో ఓ జిల్లాలో ముఠాలు ఏర్పడ్డాయని తీర్మానించి ఆ ముఠా తత్వాలకు పాల్పడుతున్న వారిని మొత్తం పార్టీ నుండి వేరు చేసి పార్టీని కాపాడటానికి బదులు మొత్తంగా జిల్లా కమిటీని రద్దు చేశారు. ఇటువంటి అనేక విపరీతాలకు రాఘవులు మార్గదర్శనం ఉంది.

విద్యార్థి యువజన విభాగాల కూడా వి.  శ్రీనివాసరావు ఇన్చార్జ్. గత మూడు సంవత్సరాలుగా తీరు వల్ల అనేక మంది యువకులు విద్యార్థులు కూడా పార్టీకి దూరమవటం ఆయన వ్యవహార శైలి ఎలాంటిదో రుజువు చేసే సందర్బం. శ్రీనివాసరావు అనుసరించిన తప్పుడు విధానాల కారణంగా రాష్ట్ర ఎస్ ఎఫ్ ఐ అధ్యక్ష కార్యదర్శులు పార్టీ కి రాజీనామా చేశారు. దాదాపు ప్రతి ప్రజాసంఘం లోనూ తనకంటూ ఓ ముఠా ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో శ్రీనివాసరావు మొత్తం పార్టీ రాష్ట్ర కేంద్రంలో తన మాటకు రాఘవులు మాటకు భిన్నంగా ఆలోచించేవాళ్ళని స్వతంత్రంగా వ్యవహరించే వాళ్లనీ సాగనంపటమే ఈ మూడేళ్లు ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. ఢిల్లీ పెద్దల పూర్తి ఆశీస్సులు వి శ్రీనివాసరావు ఉన్నాయి కాబట్టి ఆషాడం తర్వాత  జరుగుతున్న పార్టీ మహాసభల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న మధు ని తొలగించి ఆయన స్థానంలో పూర్తి బాధ్యతలు బి శ్రీనివాసరావు కట్టబెట్టటానికి రంగం సిద్ధం చేయటంలో భాగంగానే ఈ ఒంటెత్తు పనులన్నీ జరుగుతున్నాయని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.  ఇటువంటి వ్యక్తి కార్యదర్శి అయితే తాము రాష్ట్ర కేంద్రంలో పని చేయలేమని ఇప్పటికే పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్దం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *