రూ. 6 కోట్ల‌తో ఉస్మానియా మార్చురీ అభివృద్ధి

రూ. 6 కోట్ల‌తో ఉస్మానియా మార్చురీ అభివృద్ధి 

మంత్రి హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్, అక్షిత ప్రతినిధి : రాష్ట్రంలోని నిరుపేద‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్న ఉస్మానియా ఆస్ప‌త్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఉస్మానియా ఆస్ప‌త్రిలో మూడు పూట‌లా భోజ‌నం అందించే కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా ఆస్ప‌త్రిలో ఇవాళ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశామ‌ని మంత్రి తెలిపారు. ఉస్మానియా మార్చురీ ఆధునీక‌ర‌ణ కోసం రూ. 6 కోట్ల‌ను మంజూరు చేశామ‌న్నారు. దీనికి సంబంధించిన ప‌నులు కూడా ప్రారంభం అయ్యాయ‌ని తెలిపారు. ఆధునీక మార్చురీగా త‌యారు చేస్తామ‌న్నారు. ఉస్మానియా ఆస్ప‌త్రిలో కొత్త‌గా 75 ఐసీయూ ప‌డ‌క‌లు మంజూరు చేశాం. ఇవాళ 40 ఐసీయూ ప‌డ‌క‌ల‌ను ప్రారంభించామ‌న్నారు. ఈ ప‌డ‌క‌ల‌ను జ‌న‌ర‌ల్ మెడిసిన్, అన‌స్థీషీయా విభాగాల్లో ఏర్పాటు చేశామ‌న్నారు. ప్ర‌తి బెడ్‌కు వెంటిలేట‌ర్, మానిట‌ర్ ఏర్పాటు చేశాం. ఇదే ఐసీయూ బెడ్ల‌కు ప్ర‌యివేటులో అయితే రూ. 15 వేల నుంచి రూ. 30 వేల‌ వ‌ర‌కు ఛార్జీ వేస్తారు.. కానీ ఉస్మానియాలో మాత్రం ఉచితంగా వైద్యం అందిస్తున్నామ‌ని తెలిపారు. మ‌రో 30 ప‌డ‌క‌ల‌కు సంబంధించిన ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. రెండు నెల‌ల్లోనే ప్రారంభింస్తామ‌న్నారు. వీటితో పాటు మ‌రో రూ. 36 కోట్ల ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశామ‌న్నారు. ఆర్థోపెడిక్ విభాగాన్ని రూ. 2 కోట్ల 63 ల‌క్ష‌ల‌తో ప్రారంభించామ‌న్నారు. రూ. 70 ల‌క్ష‌ల‌తో పూర్తి చేసిన‌ మైన‌ర్ ఆప‌రేష‌న్ థియేట‌ర్‌ను పూర్తి చేసి ప్రారంభించామ‌ని చెప్పారు. రూ. మూడున్న‌ర కోట్ల‌తో ఐసీయూ బెడ్స్ ప్రారంభించాం. ఓపీ రిజిస్ట్రేష‌న్, ఫార్మ‌సీ బ్లాక్‌ను కూడా ప్రారంభించామ‌న్నారు. హెచ్ఎండీఏ స‌హ‌కారంతో గేటు, ప‌రిస‌రాల‌ను తీర్చిదిద్ద‌డానికి రూ. 50 ల‌క్ష‌ల‌తో శంకుస్థాప‌న చేశాం. రెండు నెల‌ల్లో పూర్త‌వుతుంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.