యువత ఉద్యోగాలు కొట్టాలే

కేటీఆర్ క్లాసెస్ యాప్‌.. యువత ఉద్యోగాలు కొట్టాలె

సిరిసిల్ల, అక్షిత ప్రతినిధి :

ఉద్యోగాలు సాధించి.. భవిష్యత్తు బంగారం చేసుకోవాలె
సిరిసిల్లలో ఫ్రీ కోచింగ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
నిరుద్యోగ యువత కోసం టీఆర్ఎస్ సర్కారు భారీగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తోందని, ఉద్యోగాలు సాధించి యువత తమ భవిష్యత్తు బంగారం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సినారె కళా మందిరంలో పోలీస్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రీ కోచింగ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అన్ని సబ్జెక్టుల వారీగా ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన ‘కేటీఆర్ క్లాసెస్‌’ పేరుతో రూపొందించిన యాప్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని అన్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే.. ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు. పాత ఆలోచనలకు స్వస్తి చెప్పి.. కొత్త కోణంలో ఆలోచిస్తే విజయం తథ్యమన్నారు.

1800 వీడియోలు..

ఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకత్వంలో జిల్లాలోని 13 మండలాల్లోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి, 750 మంది ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. లెజెండ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సౌజన్యంతో కేటీఆర్‌ క్లాసెస్‌ అనే యాప్‌ను సైతం రూపొందించినట్లు చెప్పారు. ఇందులో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల వారీగా 1800 వీడియోలు రూపొందించినట్లు వివరించారు. యాప్‌ను ప్లే స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణకు హాజరవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత యాక్సెస్‌ ఇవ్వడం జరుగుతుందని, యాప్‌ ద్వారా నిరంతరం ఆన్‌లైన్‌లో చదుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.