ఇంత వివక్షేంటి?

గుజరాతీయులే ప్రజలా..తెలంగాణ వాళ్లు కాదా!

వ్యాక్సిన్లు, ఇంజెక్షన్ల వాటాలో కేంద్ర సర్కారు పక్షపాతం
– వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల ఆగ్రహం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

వ్యాక్సిన్లు, ఇంజెక్షన్ల వాటాలో కేంద్ర సర్కారు పక్షపాతం
గుజరాత్‌కు 1,63,500 ఇంజెక్షన్లు..తెలంగాణకు 21,500 మాత్రమేనా? టీకాలు కేంద్రానికి చౌక.. మాకు ఎక్కువ ధర
ఆక్సిజన్‌ కొరత వస్తే కేంద్రానిదే బాధ్యత
కేంద్రం నుంచి ఎలాంటి సమన్వయం లేదు
ఇక్కడ తయారయ్యే ఇంజెక్షన్లూ మాకివ్వరా?
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల ఆగ్రహం
కొవిడ్‌ వ్యాక్సిన్‌ను  కేంద్రానికి రూ.150కు, రాష్ర్టాలకు రూ.400కు,  ప్రైవేటు దవాఖానలకు రూ.600కు ఇవ్వడం సరికాదు. దేశ ప్రజలందరినీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నది. టీకా రేట్లలో ఇంత వ్యత్యాసం ఉంటుందా? ఈ సమయంలో ఇలా వ్యవహరించవచ్చా? కేంద్రం సంకుచితంగా ఆలోచించవద్దు. 4 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లకు ఆర్డర్‌ పెట్టాం. కేంద్రం మాత్రం వచ్చే పది రోజులకు 21,551 వయిల్స్‌నే కేటాయించినట్టు ప్రకటించింది.

మైలాన్‌, రెడ్డీస్‌, హెటిరో తదితర మన కంపెనీలు ఈ మందులు తయారుచేస్తున్నప్పటికీ అవి మనకు దక్కడం లేదు. కరోనా నియంత్రణ వాక్సిన్‌ ద్వారానే అని తెలిసినప్పుడు ముందే ఉత్పత్తి పెంచాల్సింది. కానీ కేంద్రం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు వ్యవహరించింది. మన సలహాలు, సూచనలు పక్కన పెట్టింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంచాలని సీఎంగారు, కేటీఆర్‌ గారు మన దగ్గర ఉన్న అన్ని కంపెనీలను కోరారు. కానీ వాటిని కేంద్రం నియంత్రించింది. ఇప్పటికైనా కేంద్రం చిత్తశుద్ధితో చేస్తున్న మా కృషికి తోడుగా నిలువాలి. ఆక్సిజన్‌ మన దగ్గర తయారుకాదు. కర్ణాటకలోని బళ్లారి, ఏపీలోని విశాఖ, ఇతర రాష్ర్టాల నుంచి రావాలి. మనకు దగ్గరున్న ప్లాంట్‌ నుంచి కాకుండా 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా నుంచి కేటాయించారు. చెన్నై నుంచి 20 టన్నులు, పెరంబదూర్‌ నుంచి 35 టన్నులు కేటాయించారు. కానీ తమిళనాడు వాళ్ళు ఇచ్చేది లేదంటూ ఎగబెట్టారు. అందుకే విశాఖ నుంచి కేటాయించాలని కోరినం. కేటాయింపులు మార్చకపోతే రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడితే దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.తెలంగాణలో ఆక్సిజన్‌ కొరత ఎదురైతే దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆక్సిజన్‌ సహా వ్యాక్సిన్లు, రెమిడెస్‌విర్‌ ఇంజెక్షన్ల కేటాయింపులో తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతున్నదంటూ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. గురువారం ఆయన బీఆర్కే భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మైలాన్‌, రెడ్డీస్‌, హెటిరో.. తదితర మన కంపెనీలు రెమిడెస్‌విర్‌ వంటి మందులు తయారుచేస్తున్నప్పటికీ అవి మనకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రెమిడెస్‌విర్‌ నియంత్రణను కేంద్రం చేతుల్లోకి తీసుకొని తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడామని, ఇతర రాష్ర్టాల నుంచి కూడా పేషెంట్లు హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో ఎక్కువ కేటాయించాలని విజ్ఞప్తిచేశామని ఈటల తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కేంద్రానికి రూ.150కి, రాష్ర్టాలకు రూ.400కు, ప్రైవేటు దవాఖానలకు రూ.600కు ఇవ్వడం సరికాదని ఈటల అన్నారు. దేశ ప్రజలందరినీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్నదని చెప్పారు. ‘రేట్లలో ఇంత వ్యత్యాసం ఉంటుందా? ఈ సమయంలో ఇలా వ్యవహరించవచ్చా?’ అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత?
తమ రాష్ట్రంలో తయారైన ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లను తామే వాడుకుంటామని చెప్పొచ్చని, కానీ తాము అంత సంకుచితంగా లేమని మంత్రి ఈటల అన్నారు. విపత్కర సమయంలో కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో ముందుకు వెళ్తుంటే రాజకీయాలు మంచిది కాదని చెప్పారు. ఆక్సిజన్‌ విషయంలో తెలంగాణకు నష్టం జరిగేలా కేంద్రం చర్యలు ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 270 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వాడకం ఉన్నదని తెలిపారు. తెలంగాణలో ఆక్సిజన్‌ సమయానికి లేకుంటే దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. విశాఖ, బళ్లారి వంటి దగ్గరి ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ పంపిణీ చేయాలని కోరారు. ఐఏఎస్‌ ఆఫీసర్ల బృందం ఆక్సిజన్‌ పంపిణీ, అవసరంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నదన్నారు. ప్రభుత్వ దవాఖానలతోపాటు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్లలోనూ ఇప్పటికీ ఆక్సిజన్‌ కొరతలేదని స్పష్టంచేశారు. కొందరు ఆక్సిజన్‌ కొరత సృష్టించి బ్లాక్‌ మార్కెట్‌లో సొమ్ము చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గుజరాత్‌కు నాలుగు రెట్లు ఎక్కువ
కరోనా కష్ట సమయంలో కూడా కేంద్రం వివక్ష చూపిస్తున్నదని మంత్రి ఈటల విమర్శించారు. వ్యాక్సిన్ల విషయంలో గుజరాత్‌కు లక్షల్లో కేటాయింపులు చేస్తూ, తెలంగాణకు మాత్రం అన్యాయం చేస్తున్నదని అభ్యంతరం వ్యక్తంచేశారు. గుజరాతీయులే ప్రజలా? తెలంగాణ వాళ్లు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణకు ఇప్పటివరకు 30లక్షల డోసులే కేటాయించడం దారుణమన్నారు. గుజరాత్‌కు ఇంతకు నాలుగు రెట్లు ఎక్కువ కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్లు వేసే సామర్థ్యం ఉన్నదని, కానీ.. వ్యాక్సిన్ల కొరత కారణంగా ఆలస్యమవుతున్నదని వివరించారు.

అవసరమైతే రోజుకు 2 లక్షల పరీక్షలు
ప్రస్తుతం 104 కేంద్రాల్లో 30 వేల ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నామని, మిగిలినవి ర్యాపిడ్‌ పరీక్షలని మంత్రి ఈటల తెలిపారు. అవసరమైతే రోజుకు 2 లక్షల పరీక్షలు కూడా చేస్తామన్నారు. ప్రైవేట్‌లో 1120 హాస్పిటల్స్‌కు చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఈ దవాఖానల నుంచి కొంతమందిని చివరి క్షణంలో గాంధీకి పంపిస్తున్నారని, అలా పంపించవద్దని కోరారు. కొంతమంది కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ వాళ్ళు డబ్బు కట్టలేనివారిని చివరి దశలో గాంధీకి పంపిస్తున్నారన్న ఈటల.. ఈ సమయంలో శవాల మీద పేలాలు ఏరుకొనేలా వ్యవహరించవద్దని హితవు పలికారు.

ముందే అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్‌..
ప్రధాని నరేంద్ర మోదీ ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన తీరును గమనించిన సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఇందులోభాగంగా రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు కొరత లేకుండా తొలుత రెండులక్షల వాయిల్స్‌కి ఆర్డర్‌ పెట్టామన్నారు. సీఎం కేసీఆర్‌ మళ్లీ సంఖ్య పెంచాలని చెప్పగానే 4 లక్షల ఇంజెక్షన్లకు ఆర్డర్‌ ఇచ్చినట్టు తెలిపారు. కేంద్రం మాత్రం వచ్చే పది రోజులకు గాను కేవలం 21,551 వాయిల్స్‌ను కేటాయించిందన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్‌ కొరత లేదని వెల్లడించారు.. దేశంలో మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ సమర్థవంతంగా పని చేస్తున్నదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *