ధరణి… రైతులకు వరం

ప్రగతి పనులు పూర్తి చేయాలి

కలెక్టర్లకు సీఎస్ సోమేష్ కుమార్ దిశానిర్దేశం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బిఆర్ కెఆర్ భవన్ నుంచి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పల్లె ప్రగతి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS), హరిత హారం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లు, ధరణి, కోవిడ్ -19, వరి ధాన్యం సేకరణకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. రైతు వేదికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు, NREGS ద్వారా గ్రామాల్లో ప్రస్ఫూటంగా కనిపించే, మన్నికైన ఆస్తులను కల్పించినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను అభినందించారు. ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు సూచనల మేరకు ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లను కోరారు. ప్రతి మండలానికి చెందిన స్పెషల్ ఆఫీసర్ నర్సరీలను సందర్శించి మొక్కలు బతికేలా చూడాలని ఆయన కోరారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కోసం అనువైన స్థలాలను వ్యక్తిగతంగా పరిశీలించి ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాబోయే ఆరు నెలల్లో ఈ మార్కెట్లను పూర్తి చేయడానికి కృషి చేయాలని కోరారు. ధరణిలో చేసిన అద్భుతమైన కృషికి కలెక్టర్లను అభినందించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా క్లియర్ చేయాలని కోరారు. కోవిడ్ ప్రోటోకాల్ ను ఖచ్చితంగా పాటించాలని, మతపరమైన కార్యక్రమాలు, వేడుకలకు కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించడాన్ని అమలు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో తగినంత సంఖ్యలో వరి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఏ ఒక్క రైతు అసౌకర్యానికి గురికాకుండా కలెక్టర్లు చూడాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి S.A.M. రిజ్వీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ CIG శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్, మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ డా.యన్.సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి ప్రియాంకవర్గీస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *