స్వచ్చ మిర్యాలగూడ సాధనే ధ్యేయం

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

గుడ్ ఆఫ్టర్నూన్ మిర్యాలగూడ కార్యక్రమంలో తిరునగర్ భార్గవ్ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఉద్ఘాటించారు. స్వచ్ఛ మిర్యాలగూడ సాధనే ధ్యేయంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్రత్యేక శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. పట్టణ పరిశుభ్రత కోసం ‘గుడ్ ఆఫ్టర్నూన్ మిర్యాలగూడ…స్వచ్ఛ మిర్యాలగూడ’ అనే బృహత్తర కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఆయనే స్వయంగా రంగంలోకి దిగి పలు వార్డుల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. స్వచ్ఛ తెలంగాణ సాధన కోసం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 43 శాతానికి పైగా జనాభా నివసిస్తున్నారని అన్నారు. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో రానున్న ఐదేండ్లలో పట్టణాల్లో జనాభా 50 శాతం పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా చెత్త శుభ్రం చేస్తున్నదని అన్నారు.మిర్యాలగూడ పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, వార్డు కౌన్సిలర్ ఉదయ్ భాస్కర్, పారిశుధ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *