పల్లా గెలుపు సునాయాసం

బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
* మిన్నంటిన వంటగ్యాస్ ధరలు
* భగ్గుమంటున్న డీజిల్, పెట్రోల్ ధరలు
* కేసీఆర్ పాలననే ప్రజలకు శ్రీరామరక్ష
* అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మెరుగైన ప్రజల జీవన ప్రమాణాలు
* ప్రతిపక్షాలది దుర్మార్గపు పోకడ
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం : మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి :

బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విమర్శించారు. వంటగ్యాస్ తో సహా డీజిల్,పెట్రోల్ ధరల పెంచిన పాపం ఊరికే పొదని,ఆ ఉసురు మోడీ ప్రభుత్వానికి తప్పక తగులుతుందని దుయ్యబట్టారు. ఆకాశాన్ని అంటుతున్న వంటగ్యాస్,భగ్గుమంటున్న డీజిల్,పెట్రోల్ ధరలు చూసి సామాన్యుడు బెంబేలెత్తి పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఆయన కోదాడ నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలి అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలననే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల ఫలితాలను చిట్టచివరి వరకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేదని ఆయన కొనియాడారు. అవే సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలది దుర్మార్గపు పోకడ అని దుయ్యబట్టారు. ఈనెల 14న జరుగనున్న శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మండలి అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… నల్లగొండ,వరంగల్,ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో వరుసగా మూడో దఫా టీఆర్ఎస్ విజయకేతనం మోగించబోతుందని స్పష్టం చేశారు. అరేండ్ల టీఆర్ ఎస్ పాలనలో లక్షా 30 వేల ఉద్యోగాల భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన చెప్పారు. అంతేగాకుండా 14,800 ప్రయివేట్ పరిశ్రమలను నెలకొల్పి 14 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం దోహద పడిందని ఆయన వెల్లడించారు. వీటితో పాటు ఐటీ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో మరో 60 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలతో పాటు,దండు మల్కాపురం లో ఇండస్ట్రీయల్ పార్క్,25 వేల మెగావాట్ల ఉత్పత్తిని చేసే యాదాద్రి పవర్ ప్లాంట్ ల నిర్మాణాలు టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనకు దిక్సూచి అని ఆయన అభివర్ణించారు. ఇవన్నీ కూడా ఉపాధిని పెంచే కేంద్రాలని ఆయన చెప్పారు. శాసనమండలి సభ్యుడిగా గడిచిన ఆరేండ్లుగా ప్రజల గొంతుకనై పనిచేశానని మరోసారి అవకాశం కలిపించి ఆశీర్వదించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటర్లను అభ్యర్ధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *