తెలంగాణకు బిజేపి చేసింది శూన్యం

బీజేపీకి ఓటు అడిగే హ‌క్కు లేదు 

కేటిఆర్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హ‌క్కు లేద‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడింట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేద‌ని, ప‌థ‌కాల‌కు పైస‌లు ఇవ్వ‌లేద‌ని, ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో కేటీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌య్యారు. హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్‌న‌గర్ ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని సూచించారు.

అనేక ప్ర‌తికూల ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు మన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేటీఆర్‌ కొనియాడారు. ఒక‌ప్పుడు హైద‌రాబాద్ న‌గ‌రంలో కార్పొరేట‌ర్లుగా పోటీ చేసేందుకు నాయ‌కులు లేర‌న్న ప‌రిస్థితి నుంచి రెండుసార్లు జీహెచ్ఎంసీలో అతిపెద్ద విజ‌యాలు సాధించి మేయ‌ర్ పీఠం ద‌క్కించుకునే స్థాయికి టీఆర్ఎస్ పార్టీ చేరుకుంద‌ని గుర్తు చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ క‌లిసిక‌ట్టుగా ముందుకు న‌డిచి విజ‌యం సాధించాలని పార్టీ శ్రేణుల‌కు సూచించారు. ఏ పార్టీకైనా ప్రతి ఎన్నిక అత్యంత కీలకమైనది అనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలన్నారు.

టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి సురభి వాణి దేవి అభ్యర్థిత్వాన్ని మన ప్రత్యర్థులు సైతం అభినందించేంత‌ సానుకూల పరిస్థితులు మనకు ఉన్నాయి . ఆమెకున్న అత్యంత క్లీన్ ఇమేజ్ కచ్చితంగా గ్రాడ్యుయేట్లకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి మన పార్టీ అభ్యర్థికి సానుకూల స్పందన లభిస్తున్న‌ది. ఈ ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి వాణి దేవిని గెలిపించుకోవాలి. ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పని చేయాల్సిన అవసరం ఉన్నది.

ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా బీజేపీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అసత్య ప్రచారాలు చేయడమే తన పనిగా పెట్టుకున్నది. మిషన్ భగీరథ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా ఇంటింటికీ నల్ల నీరు మన ప్రభుత్వం అందిస్తే తమ ఘనతగా బీజేపీ చెప్పుకుంటున్నది. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా తమ ఆసత్యాలను పంచుకుంటున్నది. బీజేపీ అసత్యాలకు, ప్రలోభాలకు లొంగ‌కుండా విద్యావంతులకు మనం చేసిన పనులను బలంగా చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీకి వారికి చరిత్ర ఉన్నది గాని, భవిష్యత్తు మాత్రం లేదు. ఈ రెండు పార్టీలు మన పార్టీ అభ్యర్థిని ప్రశ్నించే పరిస్థితుల్లో లేవు. బీజేపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి గత ఆరేళ్ల‌లో గ్రాడ్యుయేట్లకు గాని తెలంగాణ రాష్ట్రానికి గాని చేసింది ఏమీ లేదు. న్యాయవాదిగా ఉన్న రామచంద్ర రావు సత్యాలు కాకుండా అసత్యాలే మాట్లాడుతున్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. రాష్ట్రానికి చట్టబద్ధంగా దక్కాల్సినవి తప్ప అదనంగా ఒక్క రూపాయి ఇవ్వలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి . ఇంత పెద్ద ఎత్తున నిర్భయంగా అసత్యాలను ప్రజల్లోకి తీసుకుపోతున్న ఆ పార్టీ తీరును మనం ప్రజల్లో ఎండగట్టాలి.

తెలంగాణలో ఓట్లు అడిగేందుకు బీజేపీ వద్ద ఒక్కటంటే ఒక్క కారణం కూడా లేదు. గత ఆరు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండ‌గ‌ట్టాలి. పెరిగిన ధరలు ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలి. మన ప్రభుత్వం గత ఆరేళ్లుగా చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మన బాధ్యతగా గ్రాడ్యుయేట్ల కి మరోసారి గుర్తు చేయాలి.

ముఖ్యంగా యువత నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అందించిన అవకాశాలను వివరించాలి. ఉద్యోగాల భర్తీ పైన ప్రతిపక్షాల అసత్యాలను దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా ఇప్పటికీ 1,33,000 ఉద్యోగాలను మనం భర్తీ చేశాం. ఉద్యోగాలు నింపడమే కాదు వాటిని అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా భర్తీ చేశాం. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలోనూ సుమారు 14 లక్షల ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంలో మనం విజయం సాధించాం. హైదరాబాద్ నగర గ్రాడ్యుయేట్లకు గత ఆరేళ్ల‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు పరిపాలన వల్ల‌ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్న తీరు తద్వారా జరిగిన సానుకూల మార్పును తెలియజేయాలి.

గత ఆరేళ్ల‌లో హైదరాబాద్ నగరం భారీగా విస్తరించింది. వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నది దుష్ప్రచారం మాత్రమే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వారంతా మనతో కలిసి పని చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో టీఆర్ఎస్‌ది పేగుబంధం. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఏర్పాటు కాగానే భారీ పీఆర్సీని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ నడుం కట్టాల్సిన అవసరం ఉన్నది. ఓటరుగా నమోదు చేయించుకున్న ప్రతి ఒక్క విద్యావంతులని కలిసి ప్రత్యక్షంగా పార్టీకి మద్దతు అడగాలి. గ‌త ఆరేళ్ల‌లో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వారితో పంచుకోవాలి. పార్టీ కోసం నిబద్ధతతో పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తకు మంచి గౌరవం దక్కుతుంది. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు దృష్టిలో ఉంచుకోవాలి’ అని కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *