5న దత్తన్నగవర్నర్‌గా ప్రమాణo

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ        ఈ నెల 5వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌గా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఇవాళ  ఉదయం  ఖైరతాబాద్  మహాగణపతిని  బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయను  ఖైరతాబాద్  గణేష్ ఉత్సవ సమితి ఘనంగా సన్మానించింది. దర్శన అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఈ నెల 4న హిమాచల్‌ప్రదేశ్ వెళ్తాను అని తెలిపారు. 5న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు. హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. దత్తన్నగా తెలుగు ప్రజలకు సుపరిచితులైన బండారు దత్తాత్రేయ 1947 జూన్ 12న హైదరాబాద్‌లో జన్మించారు. హంగులు, ఆడంబరాలకు దూరం.. ఏ పార్టీ.. ఏ ఎజెండా అన్న సంకోచాలు లేని వ్యక్తిత్వం ఆయన సొంతం. బాల్యంలోనే ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో (ఆరెస్సెస్‌లో) చేరారు. స్వయం సేవక్‌గా, ప్రచారక్‌గా ఆరెస్సెస్ నుంచి జాతీయ భావాలు పుణికిపుచ్చుకున్న దత్తన్న.. సంఘ్ ఆదేశానుసారం రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టారు. పార్టీ కార్యదర్శిగా బీజేపీలో ప్రస్థానం ప్రారంభించి.. ఎంపీగా, కేంద్ర మంత్రిగా, తాజాగా గవర్నర్ స్థాయికి ఎదిగారు. 1991లో తొలిసారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. 1997లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.  1998లో రెండోసారి ఎంపీగా ఎన్నికైన ఆయన.. వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1999లో వరుసగా మూడోసారి ఎంపీగా విజయం సాధించి మరోసారి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో నాలుగోసారి ఘన విజయం సాధించిన దత్తాత్రేయ.. మరోసారి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మోదీ మంత్రివర్గంలో కార్మిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఆదేశాలతో పోటీకి దూరంగా ఉన్నారు. దత్తాత్రేయ మొదటి నుంచి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు.

 

 

tags : dattanna, himachal governor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *