‘370 రద్దు… చారిత్రాత్మకం’

అక్షిత ప్రతినిధి, దిల్లీ :  జమ్మూకశ్మీర్‌ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలు పార్టీలు స్వాగతించాయి. ఆర్టికల్‌ 370 రద్దును చారిత్రక నిర్ణయంగా అభివర్ణించాయి. ఈ ఆర్టికల్‌ ద్వారా దేశంలో జమ్మూకశ్మీర్‌ పూర్తిస్థాయిలో అంతర్భాగమైందని కొనియాడాయి. కొన్ని పార్టీలు సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి మరీ మద్దతిచ్చాయి. ఎన్డీయే, ఎన్డీయేతర పక్షాలు కూడా కేంద్రం పక్షాన నిలిచాయి. శివసేన, బిజూ జనతా దళ్‌, అన్నాడీఎంకేతో పాటు ఏపీ నుంచి తెదేపా, వైకాపా కేంద్రం నిర్ణయానికి మద్దతు ప్రకటించాయి. ఎప్పుడూ మోదీపై నిప్పులు చెరిగే దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సైతం ఈ నిర్ణయానికి మద్దతు తెలపడం విశేషం. పలువురు ప్రముఖులు సైతం దీన్ని స్వాగతించగా.. కశ్మీర్‌కు చెందిన పార్టీలు మాత్రం దీన్ని వ్యతిరేకించాయి. కశ్మీర్‌కు ఇచ్చిన మాట తప్పారని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీ నేత మహ్మద్‌ ఫయాజ్‌ విమర్శించారు. ఇది చారిత్రక నిర్ణయం కాదని.. చారిత్రిక తప్పిదమని అభివర్ణించారు. మరోవైపు ఈ బిల్లును కాంగ్రెస్‌ పార్టీ కూడా వ్యతిరేకించింది. భారత రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కూనీ చేసిందని, ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన నిబంధనలకు భాజపా తూట్లు పొడిచిందని ఆ పార్టీక నేత గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. దీంతో పాటు తమిళనాడుకు చెందిన ఎండీఎంకకే నేత వైగో సైతం ఈ బిల్లును తప్పపట్టారు.

 

 

Tags : article 370, modi, amithsha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *