అక్షిత ప్రతినిధి, న్యూదిల్లీ: ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా డిసెంబర్ 3 నుంచి ఛార్జీలను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది. గతంతో పోలిస్తే ఈ ఛార్జీల పెంపుదల 42 శాతం వరకు ఉండనుంది. దీనికి తోడు వొడాఫోన్ ఐడియా నుంచి ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌పై కూడా నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత తొలిసారి ఓ మొబైల్ కంపెనీ టారిఫ్ ధరలను పెంచడం గమనార్హం.
‘‘వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ప్రీపెయిడ్ కొత్త టారిఫ్‌లు, ప్లాన్లు ప్రకటిస్తోంది. అన్నీ ప్లాన్లు దేశవ్యాప్తంగా డిసెంబర్ మూడో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి’’ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 1 నుంచి ఛార్జీలను పెంచనున్నట్లు కంపెనీ గత నెల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్లాన్లు ఇలా..
వొడాఫోన్ ఐడియా సవరించిన ధరలతో కొత్త ప్లాన్లు ప్రకటించింది. అన్లిమిటెడ్ కేటగిరీ కింద 2, 28, 84, 365 రోజులు కింద సరికొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. గతంలో ఉన్న ప్లాన్లను పోల్చిచూసినప్పుడు కొత్త ప్లాన్ల ధరల్లో 41.2 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అన్లిమిటెడ్ ప్లాన్ల స్థానంలో డిసెంబర్ 3 నుంచి కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ తెలిపింది. రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున 84 రోజుల కాలపరిమితితో అందించే రూ.458 ప్లాన్ ధరను తాజాగా రూ.599కి పెంచారు. ఈ ప్లాన్ ధరను 31 శాతం పెంచారు. రూ.199 ప్లాన్ ధరను రూ.249కి, ఏడాది పాటు అందించే అన్లిమిటెడ్ ప్లాన్ ధర రూ.1699 నుంచి 2,399కి పెంచారు.
అదే బాటలో ఎయిర్టెల్ కూడా..
ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించిన కాసేపటికే మరో టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ కూడా పెంపు నిర్ణయాన్ని వెల్లడించింది. తాము కూడా డిసెంబర్ 3 నుంచి ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎయిర్టెల్ సైతం 42 శాతం మేర ఛార్జీలను పెంచుతోంది. ప్లాన్ల వివరాలు తెలియాల్సి ఉంది.