అక్షిత నెట్వర్క్, దిల్లీ: అది ఒక పెద్ద ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ కంపెనీ. పేరు ట్రావెలెక్స్. హై టెక్నాలజీకి పెట్టింది పేరు. లండన్‌లో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ ట్రేడింగ్ చేస్తుంటుంది.ఒక కరెన్సీని మరో కరెన్సీలోకి మార్చుకునే ట్రావెలర్స్‌కి ఆన్లైన్ సర్వీసులు అందిస్తుంటుంది.
అయితే గతవారం హ్యాకర్స్ ఈ కంపెనీని ఎటాక్ చేశారు. ఒక ర్యాన్సమ్వేర్( RANSOMWARE ) తో డేటాను లాక్ చేసి పారేశారు. యూజర్ల డేటాని వైరస్‌తో ఎటాక్ చేసి లాక్ చేస్తారు హ్యాకర్లు. ఒకసారి ఎటాక్ చేశాక ఆ డేటాని మళ్లీ పూర్వస్థితికి వచ్చేలా డిక్రిప్ట్ చేయగలిగే అవకాశం వారికే ఉంటుంది. అందుకోసం వాళ్లు మనీ అడుగుతారు. ర్యాన్సమ్గా ఇంత ఇవ్వండి అని డిమాండ్ చేస్తారు కాబట్టి – ఈ రకం మాల్వేర్ని ర్యాన్సమ్వేర్ అని అంటారు. ట్రావెలెక్స్ వాళ్ల డేటాని డిక్రిప్ట్ చేయడానికి హ్యాకర్లు మూడు మిలియన్ల డాలర్లు – అంటే దాదాపు 21 కోట్ల రూపాయల అడుగుతున్నారు.
ఇంతకీ ట్రావెలెక్స్కి సంబంధించిన ఏ సమాచారం పోయింది, ఎంత పోయింది అంటే – దాదాపు ఐదు గిగాబైట్ల పర్సనల్ డేటాని హ్యాకర్లు కాపీ చేసి ఎన్‌క్రిప్ట్ చేయడం జరిగింది. పైగా ఎన్‌క్రిప్ట్ అయిపోయిన ఫైల్స్‌కి ప్రత్యామ్నాయంగా బ్యాకప్ ఫైల్స్ రిస్టోర్ చేసి వాడుకోకుండా ఉండేందుకు – ఆ బ్యాక్ అప్ ఫైల్స్‌ని కూడా – హ్యాకర్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఇంతకీ ఎన్‌క్రిప్ట్ అయిపోయిన ఈ డేటా లో ఏముందీ అంటే అది చాలా కీలక సమాచారం. ట్రావెలెక్స్కి సంబంధించిన కస్టమర్ల క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు సమాచారం, వాళ్ళ పుట్టినరోజులు, సోషల్ సెక్యూరిటీ నెంబర్ లు ఇలా ముఖ్యమైనవెన్నో అందులో ఇరుక్కుపోయాయి. 21 కోట్లు ఇస్తేనే అక్కడున్న ఆ ముఖ్యమైన సమాచారాన్ని వారు తిరిగి ఇస్తారు. పాపం ఈ సైబర్ దెబ్బకి ట్రావెలెక్స్లో కోట్ల రూపాయల లావాదేవీలు ఆగిపోయాయి. పైగా యూజర్ ఇన్ఫర్మేషన్ ప్రైవసీకి ఇదో గొడ్డలిపెట్టు అయిపోయింది.
ఈ మధ్యకాలంలో ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ డిజిటల్ ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. డేటా సర్వర్లలోకి దొంగతనం గా ప్రవేశించి, డేటాను దొంగిలించి, ర్యాన్సమ్వేర్తో లాక్ చేసి… తిరిగి decrypt చేయడానికి ఇంత సొమ్ము ఇవ్వాలంటూ డిమాండ్ చేసే హ్యాకర్లు రోజురోజుకీ పెరుగుతున్నారు. ఈ ర్యాన్సమ్వేర్ వలన వ్యక్తిగత కంప్యూటర్లకీ, చిన్నచిన్న ఆఫీసుకు సంబంధించిన నెట్వర్క్ కంప్యూటర్లకీ మాత్రమే మాదం ఉంటుంది, పెద్ద పెద్ద కంపెనీల డేటా సర్వర్లకి పెద్ద స్థాయి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి- వాటికి ఎటువంటి ప్రమాదం ఉండదు అని భావించడం పొరపాటని తేలుతోంది.
ఎందుకంటే ట్రావెలెక్స్ కంపెనీ చిన్నదేం కాదు. లండన్ లోని ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ కంపెనీకి ఏకంగా 27 దేశాల్లో 1200 స్టోర్లు కలిగి ఉంది. ఇంత పెద్ద కంపెనీయే ఇప్పుడు ర్యాన్సమ్వేర్ దెబ్బకి అతలాకుతలం అయ్యింది. కంపెనీ వారం లోగా డబ్బు చెల్లించకపోతే ఆ కస్టమర్ల ఫైనాన్షియల్ సమాచారం అంతటినీ – బహిరంగంగా పబ్లిష్ చేస్తాం అంటూ హ్యాకర్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు .
జరిగిన ఎటాక్ పెద్ద ప్రమాదకరమైనది కాదు అన్నట్టుగా మొదట్లో – స్టేట్మెంట్లు ఇచ్చిన ట్రావెలెక్స్ కంపెనీలో ఇప్పుడు కంగారు మొదలైంది. పెద్ద పెద్ద సంస్థల పరిస్థితి ఇలా ఉంటే ఎలాంటి డిజిటల్ సెక్యూరిటీ ప్రమాణాలూ పాటించని సామాన్య కంపెనీల, వ్యక్తుల పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాల్సిన ఉంది. అందుకే ఇప్పుడు అందరూ తమతమ కంప్యూటర్ల సెక్యూరిటీ ప్రైవసీ ల విషయంలో మునుపటి కంటే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఈ ట్రావెలెక్స్ని ఎటాక్ చేసిన ర్యాన్సమ్వేర్ పేరు సొదినొబికి (Sodinokibi) . దాన్నే రెవిల్ (REvil) అని కూడా పిలుస్తారు. పేర్లు సరే… ఇంతకీ ట్రావెలెక్స్ వారి ప్రస్తుత పరిస్థితి ఏంటి? వేరే ఏముంది? మాలిషస్ వైరస్ అటాక్ జరిగిన వారం రోజుల అనంతరం కూడా ట్రావెలెక్స్ ఇంకా కోలుకోలేదు. ఈ ఆన్లైన్ ఫారిన్ కరెన్సీ పర్చేసింగ్ సర్వీస్ కంపెనీ – తన వెబ్‌సైట్‌ని ఏడు భాషల్లో నడుపుతుంది. ఇప్పుడు అక్కడ కనిపించేది కేవలం ఒక్క హోమ్ పేజ్ మాత్రమే! అది కూడా ఈ సైబర్ ఎటాక్ గురించే! డబ్బు కట్టారా? డీల్ ఎంతవరకూ వచ్చింది? అన్నది తెలీదు కానీ… వెబ్సైట్ క్లోజ్ కాబట్టి – తన సెంటర్లలో తూతూమంత్రంగా కొన్ని ట్రాన్సాక్షన్స్‌ని మాన్యువల్‌గా నడుపుతోంది.