Saudi-Arabia

20 దేశాల విమానాలకు సౌదీ అనుమతి నిరాకరణ

రియాద్ : కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి కేసులు పెరుగుతున్నందున సౌదీ అరేబియా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. భారత్‌, పాకిస్తాన్ సహా 20 దేశాల నుంచి విమానాల రవాణాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నది. నిషేధం విధించిన దేశాల జాబితాలో యూఏఈ, జర్మనీ, అమెరికా, బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, ఈజిప్ట్, లెబనాన్, అర్జెంటీనా, ఇండోనేషియా, ఐర్లాండ్, ఇటలీ, బ్రెజిల్, పోర్చుగల్, టర్కీ, స్వీడన్, స్విట్జర్లాండ్, జపాన్ ఉన్నాయి. ఈ ఉత్తర్వులు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి. అయితే, భారత దౌత్యవేత్తలు, వైద్యులు లేదా వారి బంధువులకు మాత్రమే సౌదీ అరేబియాలో ప్రవేశించేందుకు అనుమతించారు.

సౌదీ అరేబియా స్టేట్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ 21 న సౌదీ అరేబియా తమ దేశం నుంచి విదేశాలకు బయళ్దేరే, వచ్చే విమానాలను నిలిపివేసింది. అనంతరం ఈ నిర్ణయాన్ని డిసెంబర్ 28 న పొడిగించారు. కరోనా వైరస్ కొత్త జాతి చాలా దేశాలలో గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సౌదీ అరేబియా అధికారులు చెప్తున్నారు. అయితే, జనవరి 4 వ తేదీ నుంచి విమానాలు యథావిధిగా నడిచాయి. విశేషమేమిటంటే, సౌదీ అరేబియాను సందర్శించడం తాత్కాలికంగా ఆపిన దేశాలలో కరోనా వైరస్ కొత్త జాతులు గుర్తించిన దేశాలు చాలా ఉన్నాయి. ఈ కొత్త ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రపంచం మొత్తం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న కారణం కూడా ఇదే. సౌదీ అరేబియా నిషేధించిన కొన్ని దేశాలకు కొవిడ్-19 వ్యాక్సిన్‌ను భారత్ సరఫరా చేస్తుండటం విశేషం. అంతేకాకుండా భారతదేశం తన వ్యాక్సిన్‌ను అందిస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా పేరును కూడా చేర్చారు. సౌదీ అరేబియాలో ఇప్పటివరకు 368,639 కరోనా కేసులు నమోదయ్యాయి, అందులో 6,383 మంది రోగులు మరణించగా.. 360,110 మంది నయమై దవాఖానాల నుంచి డిశ్చార్జి అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *