జీతాలకు డబ్బుల్లేవు

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్:  సాధారణంగా మొత్తం బస్సులను తిప్పడం ద్వారా రోజుకు రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని, సమ్మె కారణంగా తీవ్ర నష్టం వాటిల్లడంతో జీతాలు చెల్లించే పరిస్థితి లేదని సోమవారం హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తేల్చిచెప్పింది. మొత్తం సంస్థ ఆదాయంలో 58 శాతం జీతాలకే చెల్లిస్తున్న నేపథ్యంలో, సమ్మె కారణంగా ఏర్పడిన తీవ్ర నష్టాల వల్ల వేతనాలు చెల్లించే పరిస్థితి లేదని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జే రామచంద్రరావు చెప్పారు. మరోవైపు సోమవారం విద్యాసంస్థలు పునఃప్రారంభం సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం విస్తృతంగా బస్సులు నడిపింది. 71.77% బస్సులు రోడ్డెక్కాయి. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా విద్యాసంస్థల సమయానికి తగ్గట్టుగా బస్సులు నడిచాయి. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉదయం నుంచే వీడియోకాన్ఫరెన్స్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తూ అన్ని జిల్లాల యంత్రాగానికి సూచనలు చేశారు.

సమ్మెతో ఆదాయం కోల్పోయాం : ఆర్టీసీ యాజమాన్యం

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో సంస్థకు తీవ్ర నష్టాలు వచ్చాయని, ఈ కారణంగా సెప్టెంబర్‌ నెల జీతాలు చెల్లించే పరిస్థితుల్లో కార్పొరేషన్‌ లేదని హైకోర్టుకు సమర్పించిన కౌంటర్‌ అఫిడవిట్‌లో యాజమాన్యం పేర్కొన్నది. సెప్టెంబర్‌ నెల వేతనాలు చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ కార్మిక సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏఏజీ (అదనపు అడ్వకేట్‌ జనరల్‌) జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం ఆర్టీసీ యాజమాన్యం వద్ద రూ.7.49 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వేతనాలు చెల్లించాలంటే రూ.239 కోట్లు కావాలని, అంతమొత్తాన్ని భరించే పరిస్థితుల్లో ఆర్టీసీ లేదని పేర్కొన్నారు. సాధారణంగా మొత్తం బస్సులను తిప్పడం ద్వారా రోజుకు రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని, పండుగ సీజన్‌లో రూ.13 కోట్ల వరకు ఆదాయం వస్తుందని వివరించారు. సమ్మె కారణంగా అంచనా వేసిన ఆదాయం రాలేదని తెలిపారు. సమ్మె వల్ల పండుగ సీజన్‌లో వచ్చే అధిక ఆదాయం రూ.125 కోట్ల మేర సంస్థ కోల్పోయిందని పేర్కొన్నారు. ఆర్టీసీ వార్షిక ఆదాయానికి, వ్యయాలకు మధ్య దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర వ్యత్యాసం ఉన్నదని తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఏర్పడిన సందర్భంగా 44 శాతం ఫిట్‌మెంట్‌, తర్వాత 16 శాతం ఐఆర్‌ ఇచ్చామని.. వీటి వల్ల సంస్థపై దాదాపు రూ.1,100 కోట్ల అదనపు భారం పడిందని తెలిపారు.
మొత్తం సంస్థ ఆదాయంలో 58 శాతం జీతాలకే చెల్లిస్తున్న నేపథ్యంలో, సమ్మె కారణంగా ఏర్పడిన తీవ్ర నష్టాల వల్ల వేతనాలు చెల్లించే పరిస్థితి లేదని చెప్పారు. ఎస్మా చట్టం ప్రకారం సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసిందని, నిషేధం అమలులో ఉండగా కార్మికులు సమ్మెకు వెళ్లారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల కారణంగా కార్మిక సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని స్పష్టంచేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగం ప్రకారం, పనిచేసిన కాలానికి వేతనం పొందే హక్కు కార్మికులకు ఉన్నదని, అధికారి హోదాలో ఉన్నవారికి వేతనాలు చెల్లించినందున.. మిగతా వారికి చెల్లించే మొత్తం రూ.వంద కోట్ల వరకే ఉంటుందని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. విచారణను 29వ తేదీకి వాయిదావేసింది.

ప్రజారవాణాలో 9,191 వాహనాలు

రాష్ట్రంలో దసరా సెలవుల అనంతరం సోమవారం విద్యాసంస్థలు పునఃప్రారంభమవడంతో ప్రజారవాణాకు ఆటంకం లేకుండా బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడిపింది. పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సు మార్గమే ప్రధానంగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు, సరిపడా బస్సులు నడిపారు. దీంతో విద్యార్థులకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగలేదు. సమ్మెకు ముందు రోజువారీ షెడ్యూల్‌ ప్రకారమే నైట్‌హాల్ట్‌ బస్సులను సైతం గ్రామాలకు తరలించారు. పల్లెవెలుగు బస్సులు అన్ని గ్రామాలకు వెళ్లాయి. సోమవారం ఉద యం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 71.77 శాతం ఆర్టీసీ బస్సులు తిరిగాయి. మొత్తం 6,228 బస్సులు నడిచాయని అధికారులు ప్రకటించారు. వీటితో పాటు ప్రైవేట్‌ బస్సులు 780, మాక్సీక్యాబ్‌లు 2,232, హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులతోపాటు 100 సెట్విన్‌ బస్సులు తిరిగాయి. సోమవారం ప్రజారవాణాకు మొత్తం 9,191 వాహనాలు తిరిగాయని వెల్లడించారు. మొత్తం 11 రీజియన్లలో 4,182 మంది తాత్కాలిక డ్రైవర్లు, 5,992 మంది తాత్కాలిక కండక్టర్లు విధులు నిర్వర్తించారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 98 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. హైదరాబాద్‌లో 43 శాతం, సికింద్రాబాద్‌లో 46 శాతం బస్సులు తిరిగాయి. కాగా, రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసి ఆర్టీసీ జాక్‌, వీహెచ్‌పీ నేతలు వినతిపత్రం అందజేశారు.

సమయానుగుణంగా బస్సులు నడుపాలి: మంత్రి పువ్వాడ 

విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో బస్సులు రావడం లేదని ఫిర్యాదు రావొద్దని, పాత షెడ్యూల్‌ ప్రకారం ప్రతిరూట్‌కు బస్సు వెళ్లాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆదేశించారు. సోమవారం ఉదయం 11 గంటలకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్‌ఎంలు, ఆర్టీవోలు, ఆర్టీసీ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గంటగంటకు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తక్కువగా బస్సులు నడుపుతున్న ప్రాంతాల్లో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆర్టీసీ బస్సులే రవాణా మార్గమని, ఆ ప్రాంతాల్లో కచ్చితంగా సమయానుగుణంగా బస్సులు నడుపాలని ఆదేశించారు. కండక్టర్లు టికెట్లు ఇవ్వకుంటే చర్యలు తీసుకోవాలని, ఆర్టీవో, ఎంవీఐలు తనిఖీలుచేయాలని సూచించారు. విద్యార్థులు, వికలాంగులు, ఉద్యోగులతో పాటు పలువర్గాల పాసులన్నింటినీ అనుమతించాలని ఆదేశించారు. ప్రతి కండక్టర్‌కు టిమ్‌ మిషన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొన్ని డిపోల్లో బస్సులు కండీషన్‌ కోల్పోతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే మరమ్మతులు చేయించాలని చెప్పారు. అవసరాన్ని బట్టి కొత్తగా మెకానిక్‌, ఎలక్ట్రీషియన్లను నియమించుకోవాలని ఆదేశించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు కొన్నిప్రాంతాల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకుంటున్నారని, దాడులు చేస్తున్నారని పలుప్రాంతాల నుంచి అధికారులు మంత్రి అజయ్‌కు వివరించారు. పోలీసుల సాయం తీసుకోవాలని, ఈ విషయంలో పోలీసులు సహకరించాలని కోరారు. కలెక్టర్లు కూడా దృష్టిపెట్టాలని, భద్రత పెంచాలని ఆదేశించారు. విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

 

 

tags : rtc, strike, employees salaries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *