సమ్మెపై ప్రభుత్వానికి నివేదిస్తాం : కారం రవీందర్‌రెడ్డి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :  ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిస్తామని తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి ప్రకటించారు. ఉద్యోగసంఘాల జేఏసీ ప్రతి ఉద్యోగి సంక్షేమం కోసమే పనిచేస్తుందని, కార్మికులు, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి వివరించేందుకు వారధిగా ఉంటుందని చెప్పారు. ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు మంగళవారం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలను టీఎన్జీవో భవన్‌లో కలిసి సమ్మెకు మద్దతు కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపునకు ఆర్టీసీ కార్మికులు ముందు నిలిచారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉద్యోగసంఘాల జేఏసీ కలిసిరావాలని, న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వానికి విన్నవించాలని కోరారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమ్మెకు ఉద్యోగ జేఏసీ కూడా కలిసి రావాలని, ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుండాలని విజ్ఞప్తిచేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వంతో చర్చలకు ఉద్యోగసంఘాల జేఏసీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డిని పంపుతామని చెప్పారు.రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలతోపాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, బుధవారం సీఎస్‌కు వినతిపత్రం అందజేస్తామని ఉద్యోగసంఘాల జేఏసీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని చెప్పారు. ఉద్యోగసంఘాలు, ఆర్టీసీ జేఏసీ భేటీలో పలు అంశాలను చర్చించామని తెలిపారు. కార్మికులు అధైర్యపడవద్దని చెప్పారు. సమ్మెపై ప్రభుత్వంతో చర్చలు జరిపే అంశం ఇంకా తేలలేదని అన్నారు. ఇటీవల సీఎంను కలిసినప్పుడు ఉద్యోగుల సమస్యలపై హామీ ఇచ్చారని, అన్ని అంశాలు పరిష్కారమవుతాయనే ఆశాభావంతో ఉన్నామని చెప్పారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు కూడా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చించాలని కోరామన్నారు. కార్మికుల సమ్మెకు మద్దతునిస్తూనే పరిష్కారానికి కృషిచేస్తామని, దీనిపై తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ బుధవారం అత్యవసర సమావేశం అవుతుందని రవీందర్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినప్పుడు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఇచ్చారని, ఆ సమయంలో చాలా సంతోషపడ్డామని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఆర్టీసీ కార్మికులకు 22% కంటే జీతాలు పెరుగలేదన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిచ్చారని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని ఎంతోకాలంగా డిమాండ్ ఉన్నదని, కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. అదెలా ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా వేతనాలు పెంచిందని గుర్తుచేశారు. ఉద్యోగుల సమస్యలు, కార్మికుల అంశంపై సీఎం కేసీఆర్‌కు వివరించామని, కానీ కొంతమంది నాయకులు ఈ విషయం తెలియకుండా తమ వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడేందుకు టీఎన్జీవో కార్యవర్గ సమావేశం నిర్వహించామని, ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై తీర్మానాలు చేశామని తెలిపారు. సమ్మె సమయంలో వారు మమ్మల్ని కలిసినా, కలువకున్నా ఆర్టీసీ కార్మికులను సోదరులుగా భావిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎస్‌కు కూడా వివరిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెచేయడం కొంత బాధాకరమైనప్పటికీ.. వారికి న్యాయంచేయాలనే ఉద్దేశంతో ఉద్యోగసంఘాలతో చర్చిస్తున్నామని చెప్పారు.  ఆర్టీసీ కార్మికులకు సబ్బండవర్ణాలు మద్దతునిస్తున్నాయని, వారి సమస్యలపై చర్చించాలనే లక్ష్యంతో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కూడా ముందుంటుందని తెలిపారు. సమ్మె పరిష్కారం కాకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగే ప్రమాదముందని రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులను కాపాడుకునేలా తెలంగాణ ఉద్యోగ జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆర్టీసీకి నష్టం జరుగకుండా, సంస్థను కాపాడుకునేందుకు ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఆర్టీసీ సమస్యలు తీర్చేందుకు సీఎంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆర్టీసీ సమ్మెలో భాగంగా అన్ని నిరసనల్లో పాల్గొంటామని రవీందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగుల జేఏసీ కూడా బుధవారం సమావేశమవుతుందని, దీనిలో కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఉద్యోగులెవ్వరైనా జేఏసీలో భాగస్వాములేనని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగ జేఏసీ ముందు ఉంటుందని జేఏసీ సెక్రటరీ జనరల్ మమత అన్నారు. ఆర్టీసీ కార్మికులు తోటి ఉద్యోగులేనని, వారికి మద్దతుగా ఉంటామని చెప్పారు. ఆర్టీసీ జేఏసీ నిరసనల్లో ఉద్యోగ జేఏసీ కూడా ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని, శాంతియుతంగా, ఐక్యతతో ఉండాలని సూచించారు. ఈ భేటీలో జేఏసీ సెక్రటరీలు మామిళ్ల రాజేందర్, ఏనుగుల సత్యనారాయణ తదితరులున్నారు.

 

 

tags : rtc strike, rtc jac, tgo jac

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *