జాతి నిర్మాణానికి పునరంకితం కావాలి

స్వతంత్ర్య ఫలాలు అందరికీ దక్కాలి
* గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి
* 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ జాతి నిర్మాణానికి పునరంకితం కావాలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆకాంక్షించారు. ఎందరో ప్రాణత్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్య ఫలాలు అందరికీ దక్కాలని అభిలషించారు. మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. నియోజకవర్గ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతిపిత గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధిస్తోందన్నారు. అహింసా, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప ఆదర్శాలకు పునః ప్రతిష్ట దినంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్ఫూర్తి నింపుదామని పిలుపునిచ్చారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. 74 ఏండ్లలో పలు రంగాల్లో అభ్యున్నతి సాధించామని అన్నారు.వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పురోగతి సాధించామని అన్నారు. యువశక్తి తమ సత్తాను చాటాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశ భవిష్యత్ ను మార్చగలిగే శక్తి యువతలో దాగి ఉందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఏడేండ్లలో డెబ్భై ఏండ్ల అభివృద్ధిని మన కండ్ల ముందు సాక్షాత్కరించారని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు,త్యాగధనులు అమరులయ్యారని అన్నారు. వారి కృషి ఫలితంగా మనమంతా స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామని అన్నారు. అమరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. దీంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ఫలితంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. బడుగు,బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్నదాతల బలవన్మరణాలు ఆగిపోయాయని అన్నారు. సాగు బాగుపడాలనే ధృడ సంకల్పంతో రైతులను ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేమని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్,రైతు బంధు, రైతు బీమా, దళితుల అభ్యున్నతి, సాధికారత కోసం దళిత బంధు వంటి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రారాజు గా మార్చిందన్నారు. యువతకు ఉపాధి కల్పన కోసం వినూత్న సంక్షేమ పథకాలను అవిష్కరించిందన్నారు. ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా మహమ్మారి కుదిపేసినా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని అన్నారు. సంక్షోభంలోనూ అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూశామని అన్నారు. ప్రతీ నిరుపేదింటి ఆడపిల్ల పెండ్లి కోసం ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం పొందిన కార్యకర్త ప్రమాదవశాత్తూ మృతిచెందితే ఆ కుటుంబానికి రూ.2 లక్షల ప్రమాద బీమాను ప్రభుత్వం అందజేస్తున్నదని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహకారం అందజేస్తున్నదని చెప్పారు. అంతరిస్తున్న అటవీ సంపదను పరిరక్షించేందుకు హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మిర్యాలగూడ నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచ లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంతరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అన్నాభీమోజు నాగార్జునా చారీ, యెడవల్లి శ్రీనివాస్ రెడ్డి, మధార్ బాబా, స్కైలాబ్ నాయక్, సైదులు యాదవ్, కౌన్సిలర్లు ఉదయ్ భాస్కర్, మలగం రమేష్, సలీం, ఇలియాస్, భీంలా నాయక్, అయిల వెంకన్న, లక్ష్మీ నారాయణ, ఖాదర్,గంధం సైదులు,ఖాజా మైనోద్దీన్, షోయబ్, ఇమ్రాన్, ఆసీఫ్,మగ్దూమ్, సాధినేని శ్రీనివాస్ రావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *