13,688 మెగావాట్ల విద్యుత్ డిమాండ్

13,688 మెగావాట్లు

* మార్చి 26న గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌
* తన రికార్డులు తానే బద్దలు కొడుతున్న తెలంగాణ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

వ్యవసాయానికి నిరంతరం 5వేల మెగావాట్ల సరఫరా తెలంగాణలో విద్యుత్తు డిమాండ్‌ రికార్డులు సృష్టిస్తున్నది. ఇప్పటికే పలుమార్లు తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్న తెలంగాణ.. మార్చి 26న మరోసారి గరిష్ఠ డిమాండ్‌ను నమోదుచేయడం ద్వారా కొత్త రికార్డును సృష్టించింది. మార్చి 26న రాష్ట్రంలో 13,688 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ నమోదయ్యింది. దీనిపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ విద్యుత్తు సంస్థలపై ప్రజలు అపారమైన నమ్మకంతో ఉన్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా వ్యవస్థలను బలోపేతం చేశామని చెప్పారు. మార్చి 26న వచ్చిన గరిష్ఠ డిమాండ్‌ ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో అత్యధికమని అన్నారు. అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్తు సరఫరా చేశామని చెప్పారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో 13,168 మెగావాట్ల అత్యధిక డిమాండ్‌ నమోదైందని, ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా డిమాండ్‌ ఏర్పడిందని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా వ్యవసాయరంగానికి 5000 మెగావాట్లను సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి ముందుచూపు, విద్యుత్‌ ఉద్యోగుల కృషితో ఎంత డిమాండ్‌ ఏర్పడినా.. అవాంతరాలు లేకుండా విద్యుత్తు సరఫరా చేస్తున్నామని చెప్పారు. అందుకు అవసరమైన వ్యవస్థలను బలోపేతం చేసుకున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వ్యవసాయరంగానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని సీఎండీ పేర్కొన్నారు. విద్యుత్తు డిమాండ్‌పై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తున్నట్టు చెప్పారు.

జీహెచ్‌ఎంసీలో మూడు వేల మెగావాట్లు?

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సుమారు వేయి మెగావాట్లకుపైగా విద్యుత్తు డిమాండ్‌ పెరిగిందని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. గత సంవత్సరం జీహెచ్‌ఎంసీ పరిధిలో సగటున 1700 మెగావాట్లు వినియోగమైతే.. ఈ సీజన్‌లో గరిష్ఠంగా 2,760 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. రానున్న రోజుల్లో ఇది మూడువేల వేల మెగావాట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ‘వ్యవసాయరంగంలో ఈ సంవత్సరం విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో విద్యుత్తు వినియోగం కూడా పెరిగింది. నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ ఎడమ కాలువతో అక్కడ కూడా సాగుకు విద్యుత్తు డిమాండ్‌ ఏర్పడింది. అమెజాన్‌ డాటా సెంటర్లు మూడింటికి 30 మెగావాట్ల చొప్పున విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. టీఎస్‌ ఐపాస్‌తో హైదరాబాద్‌ నగరంలో పరిశ్రమలు వస్తున్నాయి. దీనితో విద్యుత్తు డిమాండ్‌ పెరగుతున్నది. ఐటీ పరిశ్రమలకు కావాల్సినంత విద్యుత్‌ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని రఘుమారెడ్డి చెప్పారు.

40 శాతం వ్యవసాయరంగమే

ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌) పరిధిలో 40 శాతం వ్యవసాయరంగానికే వినియోగమవుతున్నదని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావు తెలిపారు. సబ్సిడీ విద్యుత్తు వినియోగదారులు ఎక్కువగా ఎన్పీడీసీఎల్‌ పరిధిలోనే ఉన్నారని చెప్పారు. ‘మా డిస్కం పరిధిలో 5042 మెగావాట్ల డిమాండ్‌ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. దీనితో రైస్‌ మిల్లులు పెరిగాయి. ఇలా పెరిగిన డిమాండ్‌ మేరకు విద్యుత్తు సరఫరాకు సిద్ధంగా ఉన్నాం. మిషన్‌ భగీరథకు విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. భవిష్యత్తులోకూడా ఎంతటి డిమాండ్‌ వచ్చినా అవాంతరాలు లేకుండా సరఫరా చేస్తాం’ అని గోపాలరావు చెప్పారు.

నిరంతరం నిఘా

నిరంతరాయ కరెంట్‌ సరఫరా విషయమై విద్యుత్తు సంస్థలపై రాష్ట్ర ప్రజలు అపారమైన నమ్మకంతో ఉన్నారని జేఎండీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా విద్యుత్తు సంస్థల ఐటీ విభాగం ఎప్పుడూ నిఘా వేసి ఉంచుతున్నదని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని సైబర్‌ నిపుణులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. మన సర్వర్ల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *