ఇక సచివాలయం….బీఆర్‌కే భవన్‌

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ :  తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం నేపథ్యంలో తాత్కాలిక సచివాలయమైన బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే)భవన్‌లో శుక్రవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సచివాలయంలోని ప్రధాన శాఖలు ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం మంచిరోజు కావడంతో కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు బీఆర్‌కే భవన్‌లో కార్యకలాపాలను చేపట్టనున్నారు. సామగ్రి తరలింపు పూర్తయిన తర్వాత ఉద్యోగులు విధుల్లో చేరతారు. తరలింపు దృష్ట్యా ప్రస్తుత సచివాలయంలోని కార్యకలాపాలు శుక్రవారం నుంచి నిలిచిపోనున్నాయి. సందర్శకులకు అనుమతి ఉండదు. ఇప్పటికే రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ కార్యాలయం, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేషీ ఎర్రమంజిల్‌కు తరలి వెళ్లాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి సామగ్రిని గురువారం తరలించారు. దీంతో పాటు సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక, ప్రణాళిక శాఖల నుంచి ఫర్నీచర్‌, దస్త్రాలు తరలివెళ్లాయి. రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా.. సోమవారం బక్రీద్‌ పర్వదినం సందర్భంగా సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు వస్తుండడంతో ఈ రోజుల్లో మొత్తం సామగ్రి తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తారు.

బీఆరేకే భవన్‌లో ఏర్పాట్లు :
మరోవైపు బీఆర్‌కే భవన్‌లో ప్రభుత్వ శాఖల కార్యాలయాలను సిద్ధం చేశారు. ఫర్నీచర్‌ను సమకూర్చి, బోర్డులను పెట్టారు. పార్కింగు, ఇతర వసతులను కల్పించారు. ప్రత్యేక భద్రత దళం బీఆర్‌కే భవన్‌లో భద్రత ఏర్పాట్లను చేపట్టింది. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం బేగంపేటలోని మైట్రోరైలు కార్యాలయం సిద్ధమైంది. వివిధ శాఖలకు ఎంపిక చేసిన ఇతర కార్యాలయాల్లోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి గురువారం సచివాలయం తరలింపుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తరలింపు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

 

 

tags : new secreteriat, brk bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *