జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అదనపు బలగాల మోహరింపులతో కొద్దిరోజుల కిందట మొదలైన అనిశ్చితికి అమర్‌నాథ్‌ యాత్రికులు, పర్యాటకులు సాధ్యమైనంత త్వరగా రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోవాలంటూ శుక్రవారం జారీ అయిన ప్రకటనతో రాష్ట్రంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆదివారం కశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అర్వింద్‌ కుమార్‌, రా అధిపతి సమంత్‌ గోయల్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ గౌబాతో సమావేశం నిర్వహించారు. దీంతో ఏదో జరగబోతోందనే ఊహలకు మరిన్ని రెక్కలు వచ్చాయి. సోమవారం కేంద్రం మంత్రి వర్గ సమావేశంలో జమ్మూకశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోనుందనే ఊహాగానాల మధ్య పాకిస్థాన్‌ అప్రమత్తమైంది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆదేశాల మేరకు ఆ దేశ భద్రతా కమిటీ ఆదివారం సమావేశమైంది. ఇలా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే యాత్రికులు, పర్యాటకులు స్వస్థలాలకు తిరుగు ముఖం పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *