హెచ్1 బీ వీసాదారులకు భారీ ఊరట.. ట్రంప్ సర్కార్ ఆదేశాలకు యూఎస్ కోర్టు బ్రేక్!

వాషింగ్టన్: యూఎస్‌లో నివసిస్తున్న వేలాది మంది భారతీయ హెచ్1 బీ వీసాదారులకు అమెరికన్ న్యాయస్థానం ఊరటను కలిగించే తీర్పునిచ్చింది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వం ఆదేశాల్ని తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ట్రంప్ సర్కార్ ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పడంతో పాటు పున:పరిశీలించాలని యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ దిగువ కోర్టును సూచించింది. న్యాయస్థానం ఈ ఆదేశాల్ని కూలంకషంగా పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలని కోరింది. అప్పటి వరకు తుది తీర్పును కూడా నిలిపివేయాలని ఆదేశించింది. ఇక అమెరికా కంపెనీలు నిపుణులైన విదేశీయులను తాత్కాలికంగా ఉద్యోగంలో చేర్చుకోవడానికి హెచ్‌1 బీ వీసాలు కీలకం అనేది తెలిసిందే. వీటికి దరఖాస్తు చేస్తున్న వారిలో భారత ఐటీ నిపుణులే ఎక్కువగా ఉంటున్నారు.

కాగా, 2015లో ఒబామా ప్రభుత్వం హెచ్‌1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు కల్పించాలని నిర్ణయిస్తూ హెచ్-4 వీసా విధానాన్ని తీసుకొచ్చింది. అయితే, దీని వల్ల చాలా మంది అమెరికన్లు నష్టపోతున్నారని భావించిన ట్రంప్ సర్కార్ ఈ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. దీనిపై స్పందించిన యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని తాజాగా తీర్పునిచ్చింది. హెచ్-4 వీసా విధానం వల్ల అధిక ప్రయోజనం పొందుతున్నది భారతీయులే.  ప్రత్యేకించి మహిళలు ఈ విధానం యొక్క ముఖ్య లబ్ధిదారులు. అయితే, అనేక మంది యూఎస్ కార్మికులు దీనిని సవాలు చేశారు. ఈ విధానం వల్ల స్థానికులకు ఉపాధి లభించడం లేదని, వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని ట్రంప్ సర్కార్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో ట్రంప్ ప్రభుత్వం హెచ్-4 వీసా విధానాన్ని రద్దు చేయాలనే నిర్ణయానికి రావడం జరిగింది. తాజాగా కోర్టు నిర్ణయంతో భారతీయులకు, ప్రత్యేకించి మహిళలకు ఈ ఆదేశాలు మరింత ఆసరాగా నిలవనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *