హతవిధీ! ఎంతటి కంపెనీకి ఎంతటి దుస్థితి! యాండ్రాయిడా! మజాకా!

యాపిల్‌ డివైజ్‌ల్లో వాడే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఏది?

ఐఓఎస్‌. ✓

గూగుల్‌ డివైజ్‌ల్లో వాడే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఏది?

యాండ్రాయిడ్‌. ✓

మైక్రోసాఫ్ట్‌ డివైజ్‌ల్లో వాడే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఏది?

విండోస్. X

యాండ్రాయిడ్‌. ✓

అక్షిత ప్రతినిధి: అవునండీ. మొబైల్‌ ప్రపంచంలో యాండ్రాయిడ్‌కీ, ఐఓఎస్‌కీ పోటీగా మూడో ప్రత్యామ్నాయంగా నిలబడాలనుకున్న మైక్రోసాఫ్ట్‌ – ఇప్పుడు జెండా ఎత్తేసింది. “యాండ్రాయిడ్‌తో పోరాడగలిగినంత కాలం పోరాడాం. ఇక సంధి ప్రకటించి లొంగిపోవడమే బెటర్‌! ” అనుకుంది. అవునండీ. ఆధునిక కాలంలో యుద్ధాలు జరిగేది దేశాల మధ్య కాదు.. డిజిటల్‌ ప్రపంచాల మధ్య. యాండ్రాయిడ్‌ వర్సెస్‌ విండోస్‌ యుద్ధంలో ఓటమి పాలయిన మైక్రోసాఫ్ట్‌ ఇప్పుడు యాండ్రాయిడ్‌తో సంధి చేసుకోబోతోంది. మరి ఈ సంధియుగంనుంచి విడుదలయ్యే విండోస్‌ మొబైల్‌ డివైజ్‌ల్లో యాండ్రాయిడే ప్రధానపాత్ర వహించబోతోంది.

మైక్రోసాఫ్ట్‌ నుంచి తాజాగా వస్తున్న రెండు స్క్రీన్ల టాబ్లెట్‌ ‘సర్‌ఫేస్‌ ట్యాబ్‌ డ్యుయో’ లో ఉన్నది మైక్రోసాఫ్ట్‌ వారి విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కాదు. గూగుల్‌ వారి యాండ్రాయిడ్‌. అదేంటి? ప్రపంచం మొత్తం పాపులర్‌ అయిన విండోస్‌ లాంటి సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉండగా – ఏ గతీ లేనట్టు గూగుల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ మీద ఆధారపడాల్సిన ఖర్మ మైక్రోసాఫ్ట్‌కి ఏంటి? – అనకండి. విండోస్‌ అనేది పీసీల్లో హిట్‌ ఆపరేటింగ్‌ సిస్టమేగానీ… మొబైల్స్‌కి వచ్చేసరికి యాండ్రాయిడ్‌దే పై చేయి. ప్రపంచంలో దాదాపు 80 శాతం డివైజ్‌ల్ని ఆక్రమించిన యాండ్రాయిడ్‌ ని కొట్టడం మైక్రోసాఫ్ట్‌ తరం కాలేదు.

కొంతకాలం పాటు – మొబైల్‌ రంగంలోని మరో ఫెయిల్యూర్‌ సంస్థ నోకియాతో కలిసి విండోస్‌ ఫోన్లు తీసుకురావాలని ప్రయత్నించింది. కానీ మైక్రోసాఫ్ట్‌ కంటే ముందే నోకియా యాండ్రాయిడ్‌కి లొంగిపోయి, యాండ్రాయిడ్‌ ఫోన్లు రిలీజ్‌ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ కూడా గూగుల్‌ మొబైల్‌ ఆధిపత్యానికి అంగీకారం తెలపాల్సిన పరిస్థితి. ఇంతకాలంగా మైక్రోసాఫ్ట్‌ కూడా గూగుల్‌ ప్లే స్టోర్‌ మాదిరిగానే – ‘విండోస్‌ యాప్‌ స్టోర్‌’ పేరుతో ఒక యాప్‌ స్టోర్‌ నడుపుతూ వస్తోంది. త్వరలో మైక్రోసాఫ్ట్‌ దాన్ని కూడా మూసేయబోతోంది. తన యాప్స్‌ అన్నిటినీ – అయితే అటు యాపిల్‌ ఫోన్లకీ, లేదంటే యాండ్రాయిడ్‌ ఫోన్లకీ కంపాటిబుల్‌గా ఉండేలా ప్లాట్‌ ఫాం ఛేంజ్‌ చేయబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *