హక్కుల్ని హరించడమెనా … రాజకీయం ? : ప్రియాంక

అక్షిత ప్రతినిధి, దిల్లీ : కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ సారథ్యంలో శ్రీనగర్‌ చేరుకున్న ప్రతిపక్ష ప్రతినిధి బృందాన్ని అధికారులు అడ్డుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. ‘ఇంతకంటే రాజకీయం, దేశద్రోహం’ ఇంకా ఏముంటుందని నిలదీశారు. కశ్మీరీ ప్రజల హక్కుల్ని హరించివేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఈ తరహాలో కశ్మీర్‌ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల్ని హరించడం కంటే రాజకీయం, దేశద్రోహం ఇంకా ఏమీ ఉండదు. దీనికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది’’ అని ట్విటర్‌ వేదికగా ప్రియాంక పిలుపునిచ్చారు. దీనికి తోడు శ్రీనగర్‌ నుంచి తిరిగొస్తుండగా.. విమానంలో ఓ కశ్మీర్‌ మహిళ తన ఇబ్బందుల్ని రాహుల్‌కి వివరిస్తున్న వీడియోని జత చేశారు. జాతీయవాదం పేరిట ప్రభుత్వం ఇలా అణగదొక్కుతున్న వారు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారని వ్యాఖ్యానించారు.  రాహుల్‌గాంధీ సారథ్యంలో శ్రీనగర్‌ చేరుకున్న ప్రతిపక్ష ప్రతినిధి బృందాన్ని అధికారులు విమానాశ్రయంలోనే అడ్డుకుని వెనక్కి తిప్పి పంపిన విషయం తెలిసిందే. 370 అధికరణం రద్దు అనంతరం కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆంక్షలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపక్ష నేతల బృందాన్ని వెనక్కి పంపివేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్‌ వెళ్లిన 12 మందితో కూడిన ప్రతిపక్ష బృందంలో రాహుల్‌తో పాటు, గులాంనబీ ఆజాద్‌(కాంగ్రెస్‌), శరద్‌పవార్‌(ఎన్సీపీ), వామపక్ష నేతలు డి.రాజా, సీతారాం ఏచూరి తదితరులున్నారు. జమ్మూ-కశ్మీర్‌లో పరిస్థితి అంత సాధారణంగా ఏమీ లేదని అందుకే తమని తిప్పి పంపారని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

 

 

tags : priyanka, cong, kashmir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *