సీఎంఐ తాజా అధ్యయనంలో వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా 131 నగరాల్లో సర్వే
అవకాశాల వెల్లువ, ఉపాధిపరంగా, వ్యాపారపరంగా, నివాసయోగ్యంగా నగరం ఉండటంతో ఎక్కువ మంది జనాభా వలస వస్తున్నారు. అన్ని రంగాల్లోనూ దినదినాభివృద్ధి చెందుతూ ఇతర దేశాలకు, నగరాలకు ఆదర్శంగా మన రాజధాని నిలుస్తోంది. అనేక రంగాల్లో పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయని తాజాగా జేఎల్ఎల్ సిటీ మొమెంటం ఇండెక్స్ (సీఎంఐ) తాజా ఆధ్యయనంలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 131 దేశాల్లో పలు రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని పరిగణనలోకి తీసుకున్న సీఎంఐ తాజా నివేదికను విడుదల చేసింది.
హైదరాబాద్, బెంగళూరు, పుణె, కోల్కతా నగరాలు స్వల్పకాలిక వృద్ధి గమనం (షార్ట్ టర్మ్ మొమెంటం ఇండెక్స్) టాప్-5 నగరాల్లో నాలుగు స్థానాలను ఆక్రమించాయి. దిల్లీ, చెన్నై, ముంబయి టాప్-30 నగరాల్లో స్థానం పొందాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాలు మొదటి రెండు స్థానాలు, పుణె (4), దిల్లీ (8), చెన్నై (14), ముంబయి (20) స్థానాలను ఆక్రమించాయి. జనాభా, సమాచార వ్యవస్థ (కనెక్టివిటీ), ఆర్ఈ ఇన్వెస్ట్మెంట్, స్థిరాస్తి ధరలు, ఆర్థిక వృద్ధి (ఎకనమిక్ అవుట్పుట్), కార్పొరేట్ వ్యవహారాలు, నిర్మాణరంగం, రిటైల్ రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలను ప్రామాణికంగా తీసుకుని సర్వే నిర్వహించగా హైదరాబాద్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. టాప్ 30 స్థానాలను ఆక్రమించిన నగరాల్లో సాంకేతిక, ఆర్థిక, ఔషధ కంపెనీలకు విపరీతంగా డిమాండ్ ఉందని ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వృద్ధి పథంలో నడపడానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఆ నగరాలు కృషి చేయాలని నివేదిక అభిప్రాయపడింది. అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లను ఈ నగరాలు ఎదుర్కొంటున్నాయని జేఎల్ఎల్ పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, అసమానత, పర్యావరణ క్షీణత వంటి పలు సవాళ్లను ఈ నగరాలు ఎదుర్కొంటున్నాయంది. దీర్ఘకాలంలో ఇదే వృద్ధిని కొనసాగించాలంటే భవిష్యత్ అవసరాలు, డిమాండ్లను తీర్చేలా మార్కెట్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని జె.ఎల్.ఎల్ సంస్థ అభిప్రాయపడింది. జనావాస యోగ్యంగా, ధరలు అందుబాటులో ఉండేలా, లావాదేవీల్లో పారదర్శకతపై ప్రధానంగా దృష్టి సారించాలని పేర్కొంది.
పెరుగుతున్న జనాభా
నగరంలో సుమారు ఒక కోటి జనాభా ఉన్నారు. ఉపాధి అవకాశాలకు, విద్యకు, నైపుణ్యాల శిక్షణ కేంద్రాలు ఉండటంతో ఎక్కువ సంఖ్యలో జనం ఇక్కడికి చేరుతున్నారు. ఐటీ రంగంలోనూ అభివృద్ధి పథాన నడుస్తుండటంతో వివిధ రాష్ట్రాల ప్రజలు నగరానికి వలస వస్తున్నారు. ఫలితంగా జనసంఖ్య పెరిగిపోతోంది. 2030 నాటికి నగర జనాభా 1.27 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని కొన్ని సర్వేలు ఇటీవల వెల్లడించాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరమూ విస్తరిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనలో, మానవ వనరుల అభివృద్ధిలో అగ్రస్థానాన నగరం కొనసాగుతోంది.
స్థిరాస్తి ధరలు…
నగరంలో స్థిరాస్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మేరకు నగరంలో పెట్టుబడి పెట్టడానికి కొందరు ముందుకు వస్తున్నారు. ముంబయి, బెంగళూరు, దిల్లీ వంటి ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో స్థిరాస్తి ధరలు తక్కువ ఉండటంతో కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. దీంతో నగరంలో పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
నిర్మాణ, ఐటీ రంగాల్లో మేటి…
ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో భాగ్యనగరం, బెంగళూరు దేశంలోనే మేటి నగరాలని జేఎల్ఎల్ నివేదిక పేర్కొంది. హైదరాబాద్లో ఆఫీస్ మార్కెట్ లీజు లావాదేవీలు కొన్ని త్రైమాసికాల నుంచి ఊపందుకుందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఇందుకు దోహదపడుతున్నాయి. పరిశ్రమల స్థాపనకు, అనుమతుల జారీ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా నగరంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకొచ్చారు. ఇందుకే అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలకు నగరాన్ని వేదికగా ఎంచుకుంటున్నాయి.