సుస్మితా కొణిదెల… మెగాస్టార్ చిరంజీవి కుమార్తె. కానీ, అదే ఆమె గుర్తింపు కాదు! సుస్మిత మంచి కాస్ట్యూమ్ డిజైనర్. స్టార్స్ ఇమేజ్ కాకుండా పాత్రలు గుర్తుకు వచ్చేలా దుస్తులు డిజైన్ చేయడం ఆమె శైలి! అలాగే, ఆమె మంచి గృహిణి, అంతకు మించి చక్కటి తల్లి. కాబోయే నిర్మాత! ఇంటి పని… ఆఫీసు పని… రెండిటినీ సమర్థంగా నిర్వహిస్తూ తనకంటూ గౌరవం సంపాదించుకున్నారు. వర్కింగ్ ఉమన్‌గా ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్న సుస్మితా కొణిదెలతో సంభాషణ… ‘నవ్య’ పాఠకులకు ప్రత్యేకం.
తల్లిగా, గృహిణిగా కుటుంబ బాధ్యతలు… కాస్ట్యూమ్ డిజైనర్‌గా ‘సైరా’ బాధ్యతలు… రెండేళ్లు రెండిటినీ ఎలా హ్యాండిల్ చేశారు?
చెన్నైలో ఉన్నప్పుడు ‘పెప్సికో’ మాజీ సీఈవో ఇంద్రానూయి ఇంటర్వ్యూ ఒకటి చదివా. ‘వర్కింగ్ ఉమన్‌గా కెరీర్లో ఎదుగుతున్న క్రమంలో… లైఫ్‌లో అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ రీక్యాలిబ్రేట్ చేసుకోకపోతే… కోపం వచ్చేస్తుంటుంది. అప్పుడు తల్లిగా, గృహిణిగా కష్టమవుతుంది. సందర్భానికి తగ్గట్టు అడ్జస్ట్ అవుతూ… పనులు చేసుకోవాలి. డోంట్ స్టాప్ యువర్ వర్క్. అలాగే, తల్లిగా మీ బాధ్యతలు మరువకండి. రెండూ ముఖ్యమే’ అన్నారు. ఆ మాటలు నాపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. స్ఫూర్తినిచ్చాయి. ‘వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో పనులను సమర్థంతంగా నిర్వహిస్తూ ముందుకు వెళుతుంటే… మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. వాళ్లకు మీరు ఆదర్శంగా నిలుస్తారు. నిలవాలి’ అన్నారామె. ఇప్పుడు మా పిల్లలకు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ… భవిష్యత్తులో నన్ను చూసి వాళ్లు గర్వపడాలి. అందుకని, కొన్నిసార్లు కష్టమనిపించినప్పటికీ… ఇష్టంగా చేస్తున్నా.
పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు… ఎవరితో చెప్పుకుంటారు?
మా ఆయన విష్ణుప్రసాద్గారితో! నా బిగ్గెస్ట్ సపోర్ట్ ఆయనే. పిల్లలు ఇద్దరూ నా స్ట్రెస్ బస్టర్స్! నేనెప్పుడూ పని ఒత్తిడికి లోను కాను. వారంలో 15 కాస్ట్యూమ్స్ రెడీ చేయమన్నా… రాత్రీపగలూ కష్టపడి చేయగలను. కానీ, క్రియేటివ్ ఇగోలు హ్యాండిల్ చేయడం కష్టమే. నాకూ క్రియేటివ్ ఇగో ఉంటుంది. ‘సైరా’ వంటి భారీ కాస్ట్యూమ్ డ్రామాకు పని చేసేటప్పుడు కొన్ని క్రియేటివ్ ఆర్గ్యుమెంట్స్ కామన్. అలాగే, కుటుంబానికి చాలా రోజులు దూరంగా ఉండటంతో అప్పుడప్పుడూ కన్నీళ్లు వచ్చేవి. మా ఆయనతో చెప్తే ‘కూల్ డౌన్. థింక్ పాజిటివ్’ అని స్ఫూర్తినిచ్చేవారు. (నవ్వుతూ…) ఆయన మాటలు వినీ వినీ పిల్లలూ ‘అమ్మా! థింక్ పాజిటివ్. జస్ట్ రిలాక్స్’ అంటున్నారు. యాక్చువల్లీ… మేం ఉండేది చెన్నైలో. మావారి వ్యాపారాలు అక్కడే. ‘సైరా’ అవకాశం వచ్చినప్పుడు ‘నీ కెరీర్‌కి ఇంపార్టెంట్ చిత్రమిది. సో… నువ్వు హైదరాబాద్ వెళ్లు. పిల్లలకు తల్లి అవసరం ఉంటుంది. వాళ్లను నీతో ఉంచుకో. రోజులో ఒక్కసారైనా వాళ్లు నిన్ను చూస్తే హ్యాపీగా ఫీలవుతారు. నేను వచ్చి వెళతా’ అని ఆయన అన్నారు. రెండేళ్లు చెన్నై టు హైదరాబాద్ వచ్చి వెళ్లారు. ఆయన వల్లే, ‘సైరా’కు ప్రశాంతంగా పని చేశా.
‘సైరా’లో చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, అనుష్కకు దుస్తులు డిజైన్ చేశా. జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులకు ఉత్తరా మీనన్ డిజైన్ చేశారు. మేమిద్దరం, రాజీవన్‌గారు ఒక గ్రూపుగా పెద్ద స్టూడియో తీసుకుని వర్క్ చేశాం. అంజూ మోడీ కాస్ట్యూమ్స్‌కి కలర్ ప్యాలెట్ సెట్ చేశారు.
షూటింగ్ అంటే 9 టు 6 జాబ్ కాదు. ఒక్కోరోజు ఆసల్యం కావచ్చు. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నానని…
‘సైరా’ చిత్రీకరణ ఎక్కువ శాతం కోకాపేటలో జరిగింది. పిల్లల స్కూలు శేరిలింగంపల్లిలో. లొకేషన్‌కి దగ్గరే! దాంతో స్కూల్ పూర్తయ్యాక పిల్లల్ని లొకేషన్‌కు రమ్మనేదాన్ని. షూటింగులో సాయంత్రం నాలుగు గంటల సమయంలో టీ బ్రేక్ ఇస్తారు. అదే టైమ్‌కి పిల్లలు వచ్చేవాళ్లు. వాళ్లకు స్నాక్స్ తినిపించి, వాళ్లతో కాసేపు హోమ్ వర్క్ చేయించి ఇంటికి పంపేదాన్ని. వాళ్లు నిద్రపోయే సమయానికి ముందే షూటింగులో పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేదాన్ని. కాసేపు వాళ్లతో టైమ్ స్పెండ్ చేసేదాన్ని. ఇక, సెలవులు అయితే పిల్లలు సెట్‌కి వస్తారు. ‘సైరా’ భారీ కాస్ట్యూమ్ హిస్టారికల్ డ్రామా కావడంతో వాళ్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కత్తులు, కటారులు, సెట్స్… వంటివి పిల్లలకు బాగా నచ్చాయి.
గతంలో మీరు మోడ్రన్ ఫిల్మ్ చేశారు. ఇదేమో హిస్టారికల్! ఎలాంటి రీసెర్చ్ చేశారు?
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం కథల్లో ఉంది. చరిత్రను కొందరు అక్షరబద్ధం చేశారు. కానీ, ఫొటోలు, పెయింటింగులు లేవు. గూగుల్‌లో వెతికితే దొరకవు. ఒక్కటంటే ఒక్కటే ఫొటో ఉంది. సురేందర్‌రెడ్డిగారు పాత న్యూస్ పేపర్లు, మద్రాస్ గెజిట్స్, లండన్‌లో రికార్డులు అన్నీ రీసెర్చ్ చేశారు. ఆయనతో కలిసి ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్‌గారు సెట్ స్కెచ్‌లు వేశారు. ఆర్టిస్టుల లుక్స్, హెయిర్ స్టైల్స్ విషయంలో ప్రాథమికంగా కొన్ని స్కెచ్.
నాన్నను కన్విస్ చేయమనేవాడు!
‘‘తండ్రీకొడుకులుగా నాన్నగారు, చరణ్ మధ్య ఏముంటుంది? కొడుకుగా నాలుగు తిట్లు తిని బయటకు వచ్చేస్తాడు. కానీ, హీరోగా, నిర్మాతగా ఇద్దరి మధ్య ఎన్నో విషయాలు ఉంటాయి. ప్రొఫెషనల్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు చరణ్ నన్ను ముందుకు తోసేవాడు. సినిమా పరంగా నాన్నగారు ఏదైనా అవసరం లేదంటే… ‘లేదులే. ఓకే’ అని చరణ్ వచ్చేసేవాడు. ఆతర్వాత నా దగ్గరకు వచ్చి ‘నాన్న ఎలాగైనా చేయాలి. ఆయన్ను కన్విన్స్ చేసి ఒప్పించు’ అనేవాడు. నాన్న దగ్గరకు వెళ్లి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పి కన్విన్స్ చేసి ఒప్పించే ప్రయత్నం చేసేదాన్ని.’’
అమ్మ సలహాలు తీసుకున్నా
కాస్ట్యూమ్స్, ఫ్యాబ్రిక్స్ కోసం ఎక్కడెక్కడికి వెళ్లారు?
రాయలసీమ నేపథ్యంలో సాగే కథ కాబట్టి… ఫ్యాబ్రిక్, డిజైన్స్ కోసం ఇక్కడ దొరికే ఫ్యాబ్రిక్స్ ఎక్కువ వాడాం. పోచంపల్లి, గద్వాల్, వెంకటగిరి, మంగళగిరి వెళ్లాం. ఆ కాలంలో వస్త్రాలు కొంచెం వేరుగా ఉంటాయి. నేరుగా మార్కెట్లో ఉండవు. అందుకని, ప్రీ ప్రొడక్షన్ టైమ్‌లోనే ఫ్యాబ్రిక్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. దానికి కొంచెం టైమ్ పట్టింది. చేనేత కార్మికుల దగ్గర మేం చేయించుకున్నాం. మా అదృష్టం ఏంటంటే… చేనేత కళాకారులు హైదరాబాద్ నగర శివార్లలో అందుబాటులో ఉన్నారు. ఒక వ్యక్తికి వర్క్ ఇస్తే… ఆయన ఊళ్లకు వెళ్లి డిజైన్ చేయించి తీసుకొచ్చేవారు.
మరి, చీరలు నగలు?
అప్పట్లో చీరలు 12 మీటర్లు ఉండేవి. నయనతార, తమన్నాతో పాటు మహిళా ఆర్టిస్టులు అందరికీ చేనేత కళాకారుల దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా 12 మీటర్ల చీరలు చేయించాం. ప్రతి చీరా ఖరీదైనదే. నగల విషయానికి వస్తే… అప్పట్లో రాళ్లు పొదిగిన నగలు ఎక్కువ. వాటిని అలాగే చేయలేం. అందుకని, కొంత స్వేచ్ఛ తీసుకున్నాం. అలాగని, చరిత్రను వక్రీకరించలేదు. ‘మీరు క్రియేట్ చేసే సెట్స్, నేను డిజైన్ చేసే కాస్ట్యూమ్స్… ఇవన్నీ చరిత్రకు రిఫరెన్సులుగా మిగులుతాయి. అందుకని, జాగ్రత్తగా చేద్దాం’ అని రాజీవన్తో చెప్పాను. అలాగే చేశాం. హీరోయిన్ల కాస్ట్యూమ్స్, నగల విషయంలో అమ్మ సలహాలు చాలా తీసుకున్నాను. చీరల విషయంలో అమ్మకు నాకంటే మంచి నాలెడ్జ్ ఉంది. అందుకని, ఒక షెడ్యూల్ స్టార్ట్ కాక ముందు చీరలను అమ్మ దగ్గరకు తీసుకువెళ్లా. కొన్ని టిప్స్ ఇచ్చారు. మా గ్రాండ్ పేరెంట్స్ నగలు కొన్ని ఉపయోగించాం. ఈతరం ప్రేక్షకుల కంటికి అలవాటు పడిన రంగులు కొన్ని ఉంటాయి. వాటిని దాటి డిజైన్ చేస్తే నచ్చకపోవచ్చు. మరీ పాతకు వెళ్లిపోయారనుకోవచ్చు. కమర్షియల్‌గా వర్కవుట్ కాదు. అందుకని, చిన్న చిన్న మార్పులు చేశాం.
కొంతమంది యాక్టర్స్‌కి కొన్ని కాస్ట్యూమ్స్ సూట్ కావు. అందుకని, సెట్లో మార్చిన కాస్ట్యూమ్స్ ఏమైనా ఉన్నాయా?
షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందే ప్రతి యాక్టర్‌కీ లుక్ టెస్ట్ చేశాం. అయితే… లుక్ టెస్ట్ పేరుతో స్టార్స్ టైమ్ ఎక్కువ తీసుకోలేను. వాళ్లు ఇచ్చిన 30, 40 నిమిషాల్లో డౌట్ ఉన్న కాస్ట్యూమ్స్ ట్రయల్స్ వేయించాను. మనకు ఏ డ్రస్సు బావుంటుందో మనకే తెలుస్తుంది. అందుకని, వాళ్ల సలహాలు నోట్ చేసుకుని, లుక్ టెస్ట్ చేసిన డ్రస్సులను బట్టి మిగతావి 30, 40 డ్రస్సులు చేసుకున్నాం. ఉదాహరణకు… నయనతారకు ఒక పర్సనాలిటీ, స్టైల్ ఉంటాయి. ఆమెకు, పాత్రకు మధ్యలో ఒక బ్యాలెన్స్ తీసుకుని కాస్ట్యూమ్ డిజైన్ చేసేదాన్ని.
సెట్లో ఎప్పుడైనా టెన్షన్ పడ్డారా?
ప్రతిరోజూ! ప్రతి కొత్త కాస్ట్యూమ్ వచ్చినప్పుడు టెన్షన్ ఉంటుంది. నాన్నగారు ఆ మేకప్ వేసుకునే వరకూ కొంచెం టెన్షన్ పడ్డా. భయపడ్డా. ప్రతి కొత్త కాస్ట్యూమ్ వేసినప్పుడు.. కొత్త ఎక్స్పీరియన్స్. నాన్నకు నచ్చుతుందా? కంఫర్టబుల్‌గా ఉంటారా? కలర్ గురించి ఏమంటారో? అనే టెన్షన్ ఉండేది. ముందే చూపించినా… ఆ రోజు సెట్లో సీన్ పేపర్ చదివిన తర్వాత, ఆ మూడ్‌లోకి వెళ్లిన తర్వాత కూడా… నాన్నకు ఆ కాస్ట్యూమ్ సూటవుతుందా? లేదా? అనేది ప్రతి రోజూ ఎగ్జామే.
‘సైరా’కు మీకు వచ్చిన కాంప్లిమెంట్స్?
‘సైరా’ ట్రైలర్ విడుదలయ్యాక… ‘ఉయ్యాలవాడగా కనిపిస్తున్నది చిరంజీవి అనేది మర్చిపోయి పాత్రను మాత్రమే చూశాం. కాస్ట్యూమ్స్ అంత బాగా డిజైన్ చేశారు’ అని చాలామంది మెచ్చుకున్నారు. ఇంట్లో అమ్మ, చరణ్, మా చెల్లి శ్రీజ కూడా ప్రశంసించారు. ‘రంగస్థలం’ చూశాక… ‘చరణ్ కనిపించలేదు. మాకు తెరపై చిట్టిబాబు మాత్రమే కనిపించాడు’ అన్నారు. స్టార్ ఇమేజ్ కాకుండా పాత్రలు మాత్రమే కనిపించడంలో నటీనటుల కృషి ఉన్నప్పుడు కాస్ట్యూమ్స్‌కి కూడా గుర్తింపు, గౌరవం లభిస్తాయి. షూటింగులో నాన్నగారు ఒకరోజు… ‘‘హిస్టారికల్ కాస్ట్యూమ్ డ్రామా చేయడం కష్టం. పాత్రలో దిగడానికి నీ కాస్ట్యూమ్స్ 50 శాతం సహాయపడ్డాయి’’ అన్నారు. తమన్నా కూడా ‘మీ కాస్ట్యూమ్స్ వల్ల నా పని 50 శాతం సులభమైంది’ అని చెప్పింది. ‘సైరా’ కాస్ట్యూమ్స్ రీసెర్చ్ కోసం కాలేజీకి వెళ్లానని చెప్పాను కదా.