సువిశాల… సుప్రసిద్ద పుణ్య క్షేత్రం… యాదాద్రి

సువిశాల యాదాద్రి

★ ఇలలోనే వైకుంఠనగరం..
యాదగిరి క్షేత్రం

★ 17.32 ఎకరాల్లో నృసింహ
ఆలయ పునర్నిర్మాణం

★ కొండపై సువిశాలమైన స్థలంలో
తుదిదశకు చేరిన నారసింహుడి
ఆలయ నిర్మాణ పనులు

యాదాద్రి భువనగిరి, అక్షిత ప్రతినిధి :

ఉగ్రజ్వాలాముఖ గండభేరుండ యోగిపుంగవ లక్ష్మీనారసింహస్వామిని ఐదు రూపాలలో దర్శించుకోవడం కంటే జన్మకు సార్థకత ఏమున్నది! అపూర్వ నిర్మాణంతో ఇలలోనే వైకుంఠనగరాన్ని ఆవిష్కరిస్తున్న యాదాద్రి విరాట్‌రూపాన్ని చూడటానికి ఎన్ని కన్నులైనా చాలడంలేదు. ఆధ్యాత్మిక యాదగిరి.. అద్భుత దివ్యక్షేత్రంగా పునరవతరిస్తున్నది. విశాలమైన 17.32 ఎకరాల్లో పంచనారసింహుడి దివ్య సన్నిధాన పునర్నిర్మాణానికి ప్రారంభమైన మహామానవ ప్రయత్నం.. స్వామివారి దివ్య ఆశీస్సులతో పరిపూర్ణమవుతున్నది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత మహాద్భుతంగా, సువిశాలమైన స్థలంలో శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ నగరిలో ఒక్కో కట్టడానికి ఒక్కో కొలతలు వేసి అందంగా, భక్తులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి కొండపై శిల్ప కళాసౌరభంగా రూపుదిద్దుకుంటున్న పంచనారసింహ క్షేత్రం నిర్మాణాలను 17.32 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇందులో 4.30 ఎకరాల్లో ప్రధానాలయం, బ్రహ్మోత్సవ మండపం, మాఢవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల రాజగోపురాలు, వేంచేపు మండపం, రథశాల, లిప్టు నిర్మించగా, పనులు తుదిదశకు చేరుకున్నాయి.

ఆలయం చుట్టూ ప్రహరీని సైతం నిర్మిస్తున్నారు. పడమర దిశలో 125 మీటర్ల పొడవు, 50 ఫీట్ల ఎత్తు, దక్షిణ భాగంలో 215 మీటర్ల పొడవు, 100 ఫీట్ల ఎత్తు, ఉత్తర భాగంలో 215 మీటర్ల పొడవు, 20 ఫీట్ల ఎత్తుతో ప్రహరీ నిర్మిస్తున్నాయి. ఉత్తర భాగంలో ప్రహరీ పక్కనే 330 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పులో గార్డెన్‌ నిర్మించి, పూల మొక్కలు, పచ్చని గడ్డి నాటాలని వైటీడీఏ అధికారులు యోచిస్తున్నారు. ఇందులో శంకు, చక్ర, నామాలను అమర్చనున్నట్టు తెలుస్తున్నది. మిగతా 13.02 ఎకరాల్లో శివాలయం, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్‌, విష్ణు పుష్కరిణి నిర్మించగా, ఎస్కలేటర్‌, బస్టాండ్‌, అంబులెన్స్‌, మెట్ల నిర్మాణం, వీవీఐపీ అతిథిగృహం, ఈవో కార్యాలయం, అర్చకుల విశ్రాంతి గది, షాపింగ్‌, క్లాక్‌ రూంలు, పోలీస్‌ ఔట్‌ పోస్టు గదులు, సెక్యూరిటీ రూం, బస్సు, ఫైర్‌ వాహనం పార్కింగ్‌, జీఎల్‌ఆర్‌ పంపుహౌస్‌, కారు పార్కింగ్‌, వీవీఐపీ పార్కింగ్‌ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నారు.

గతంలో కేవలం 1.30 ఎకరాల్లో ఉన్న యాదాద్రీశుడి ఆలయం ప్రస్తుతం 4.30 ఎకరాలు వరకు పెరిగింది. శివాలయంతోపాటు పుష్కరిణి, ప్రసాదవిక్రయశాల నిర్మాణం, భక్తుల మౌలిక వసతుల ఏర్పాటుతో యాదాద్రిపై నిర్మాణాలు మరింత విస్తరించనున్నాయి. పూర్తి ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా చేపడుతున్న నిర్మాణాలు భక్తులకు ఆకట్టుకోనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *