సుపరిపాలనకు…. కొత్త రెవెన్యూ చట్టం : చంద్రశేఖర్‌రావు

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌ :   రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎలాంటి యాతన లేకుండా సేవలందించడమే లక్ష్యంగా కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకొంటున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. త్వరలో జరుగునున్న బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. ప్రజలవద్దకు పాలన అందించడంకోసమే సంస్కరణలు తీసుకొస్తున్నామని, ఆత్మవిశ్వాసం- సానుకూల దృక్పథంతో సుపరిపాలనదిశగా ముందుకు సాగుతున్నామని సీఎం పేర్కొన్నారు. గోల్కొండ కోట వేదికగా గతంలో అనేక కార్యక్రమాలను ప్రారంభించుకొని ఫలితాలు సాధించామని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణ పల్లెలు, పట్టణాలను బాగుచేసుకుందామని పిలుపునిచ్చారు. ఇందుకోసం అరవైరోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలనా సంస్కరణల ఫలితంగా తండాలు, గూడేల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగురవేసిన దృశ్యం ఆవిష్కృతమైందని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్యసమితి ప్రశంసించటం ద్వారా తెలంగాణ రాష్ర్టానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగిందన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని సీఎం పేర్కొన్నారు. గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చారిత్రక గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయజెండాలు ఎగురవే శారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గోల్కొండ కోటలో పతాకావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.. ప్రసంగం ఆయన మాటల్లోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్య్రంకోసం పోరాడిన త్యాగధనులకు ఈ సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. సాధించుకొన్న తెలంగాణ రాష్ర్టాన్ని సరైన దిశలో పెట్టేందుకు ఐదేండ్లలో మనం చిత్తశుద్ధితోచేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. అవుతున్నాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ఐదేండ్లుగా స్థిరంగా కొనసాగుతున్నది. కేంద్రప్రభుత్వ నివేదిక ప్రకారం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 14.84 శాతం వృద్ధిరేటుతో జీఎస్డీపీలో మన రాష్ట్రం ముందువరుసలో ఉన్నది. రాష్ట్ర సంపద ఐదేండ్లలో రెట్టింపయింది. రాష్ట్రం ఏర్పడిననాడు తెలంగాణలో రూ.4 లక్షల కోట్ల విలువైన సంపద ఉంటే, నేడు 8.66 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడం మన ఆర్థిక ప్రగతికి సంకేతంగా నిలుస్తున్నది. రాష్ట్రంలో శాంతిసామరస్యాలు వెల్లివిరుస్తున్నాయి. ఆదర్శవంత పాలనతో దేశం దృష్టిని ఆకర్షించగలిగాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన జీవన విధ్వంసం సృష్టించిన దుష్పరిణామాలను అధిగమించగలిగాం. రాష్ట్రం ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తున్నది. స్వాతం త్య్ర దినోత్సవ స్ఫూర్తితో తెలంగాణ పల్లెలను, పట్టణాలను బాగుచేసుకునే ప్రణాళికను ఆవిష్కరించాలని, సుపరిపాలన దిశగా ప్రయా ణం ప్రారంభించాలని ప్రభుత్వం తలపెట్టింది. గ్రామాలను, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం చట్టపరమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంకోసం కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటుచేసింది. గతంలో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్లను 69కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలుంటే ఇప్పుడు 142 మున్సిపాలిటీలున్నాయి. కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకుని, కార్పొరేషన్ల సంఖ్యను 13కు పెంచుకున్నాం. గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చింది. గతంలో 8,690 గ్రామపంచాయతీలుంటే, వాటి సంఖ్యను 12,751కు పెంచాం. ఇటీవలే కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు ఇవాళ మొదటిసారిగా గ్రామపంచాయతీలుగా మారిన తమ పల్లెలు, తండాలు, గూడేల్లో సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురేసుకుంటున్న దృశ్యం ఆవిష్కృతమైంది.  ఉద్యోగావకాశాలు స్థానికులకే ఎక్కువ దక్కాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చట్టంచేసి, కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని కూడా పొందింది. ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే రాష్ట్రంలో ఉద్యోగనియామకాలు జరుగుతున్నాయి.  బూజుపట్టిన పాత రెవెన్యూ చట్టాలు రైతులకు, ప్రజలకు అపార నష్టం కలిగించాయి. ఈ నష్టాన్ని నివారించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు, రైతులకు ఎలాంటి యాతన లేకుండా సేవలందించడమే లక్ష్యంగా, కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకుంటున్నది. చట్టం రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైంది. అవినీతికి ఆస్కారం లేని, అలసత్వానికి అవకాశం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలోనే జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడుతామనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన అందించడానికి ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని, నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చింది. నూతన రెవెన్యూ చట్టం కూడా రూపుదిద్దుకుంటున్నది. ఈ మూడు కొత్త చట్టాల వెలుగులో రాష్ట్రంలో కచ్చితంగా పరిశుభ్రమైన, పచ్చదనం వెల్లివిరిసే గ్రామాలు, మున్సిపాలిటీలను తయారుచేసుకోగలమనే దృఢమైన విశ్వాసం నాకున్నది.

 

 

tags : 15th august celebrations, telangana,golkonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *