సాహస యాత్రికుడికి… సిద్దార్ధ అభినందన

 

రైడర్ సద్దాంకు అడుగడుగునా జన నీరాజనం 

43 రోజుల్లో 15 రాష్ట్రాల్లో 16వేల కిలోమీటర్లు బైక్ పై చుట్టివచ్చిన యువకుడు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంపై అభిమానం…ఊరిపై మమకారం’ అనే వినూత్న కాన్సెప్ట్ తో దేశంలోని 15 రాష్ట్రాల్లో 16వేల కిలోమీటర్లను కేవలం 43రోజుల్లో చుట్టివచ్చిన బైక్ రైడర్ సద్దాం ను ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తనయుడు సిద్దార్ధ తన క్యాంపు కార్యాలయంలో సత్కరించి అభినందించారు. సద్దాం భవిష్యత్తులో మరెన్నో సాహసోపేతమైన యాత్రలను చేపట్టి మిర్యాలగూడ నియోజకవర్గ పేరు ప్రతిష్టలను ఇనుమడించి రికార్డులు సాధించాలని ఆకాంక్షిస్తారు. ఆయన చేపట్టనున్న యాత్రలకు సంపూర్ణ సహకారం అందజేస్తామని భరోసా కల్పించారు. కాగా, మిర్యాలగూడ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు షహనాజ్ బేగం కుమారుడు సద్దాంకు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం. గతేడాది నవంబర్ 19న బైకుపై యాత్రను ప్రారంభించి 16వేల కిలోమీటర్లు పర్యటించిన సద్దాం జనవరి1న మిర్యాలగూడకు చేరుకున్నాడు. సాహసోపేత యాత్రలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దేశ సరిహద్దు ప్రాంతమైన సెలా పాస్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావులతో కూడిన ఫ్లెక్సీ ని ప్రదర్శించాడు. తద్వారా, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే భాస్కర్ రావులపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ యువజన నాయకులు యర్రమళ్ళ దినేష్, తీరంశెట్టి కోటేశ్వర్ రావు, షోయబ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *