సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారు

మేడారం జాతర తేదీలు ఖరారు

ములుగు,అక్షిత ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం మహాజాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.16 న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందుల రాజు గద్దె పైకి,17 న చిలకల గుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దెల పైకి,18 న మొక్కులు,19 న తల్లుల వన ప్రవేశం తో జాతర ముగుస్తుందనీ నిర్వాహకులు తెలిపారు.భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే.జాతర ముగిసేనాటికి వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 2 కోట్లకు పైగా జనాభా హాజరవుతారు అని అంచనా.ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవుల్లో ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనులకు ఆరాధ్య దేవతలు, కష్టాలు తొలిగించే కలియుగ దైవాలుగా, వన దేవతలుగా సమ్మక్క-సారక్కలు పూజలందుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర పేరుగాంచినది. దీనికి తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,ఒడిషా,చత్తీస్‌గఢ్,జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.అమ్మవార్లకు ఇష్టమైన బంగారం(బెల్లం)ను భక్తులు సమర్పించుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *