సమన్వయంతో భూసేకరణ చేపట్టాలి

భూసేకరణ పనులు వేగవంతం చేయండి
 అధికారులకు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క‌లెక్ట‌ర్ వెంకట్రావు ఆదేశం 

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, అక్షిత ప్రతినిధి :

వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణను వేగవంతం చేయాలని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు అధికారులను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న భూముల్లో కొనసాగుతున్న తవ్వకాల పనులకు రైతులు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా క‌లెక్ట‌ర్‌ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఇత‌ర శాఖ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వివిధ ప‌నుల పురోగ‌తిని స‌మీక్షించారు. వివిధ రైల్వే ప్రాజెక్టుల కింద పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాల్సిందిగా రైల్వే ఇంజినీర్లు, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల‌ని పేర్కొన్నారు. పాలమరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్, వల్లూర్, శ్యామ్‌గడ్డ తండ గ్రామాల్లోని రైతులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న భూముల్లో తవ్వకాల పనులను అడ్డుకుంటున్నారని రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. దీనిపై క‌లెక్ట‌ర్ స్పందిస్తూ ఆర్డీఓ రైతులతో మాట్లాడి ప‌నుల‌ను అడ్డుకోకుండా చూడాలన్నారు. ఇప్ప‌టికే స్వాధీనం చేసుకున్న భూముల్లో ప‌నులు య‌ధావిధిగా జ‌రుగుతాయ‌ని వెంకట్రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *