శ్రీదేవి కోసం అమల భావోద్వేగపు పోస్ట్‌

అలనాటి నటి శ్రీదేవి అనంతలోకాలకు వెళ్లిపోయి, అభిమానుల్ని శోకసంద్రంలోకి నెట్టేశారు. ఆమె చనిపోయి నేటికి నాలుగు రోజులు అవుతున్నా, ఇప్పటికీ ఇదో ‘కథగా..కల్పనగా’నే ఉంది. దుబాయ్‌లోని ఓ హోటల్‌ గదిలో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి ఆమె మరణించారు. అయితే శ్రీదేవి చనిపోయిన తర్వాత ఆమె సర్జరీలు, డైటింగ్‌లు చేయడం వల్లే చనిపోయారంటూ ప్రచారం జరిగింది.

దీనిపై ఇప్పటికే ఏక్తా కపూర్‌, రేణుకా షహానే, విద్యుల్లేఖ రామన్‌ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణంపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిన నేపథ్యంలో అన్యాపదేశంగా అక్కినేని అమల ఫేస్‌బుక్‌లో ఓ భావోద్వేగపు పోస్ట్‌ పెట్టారు.

‘‘ఎందుకు ఇంత అలసిపోయినట్లు ఉన్నాను?, ఎంత బరువు పెరిగాను? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా నన్ను ప్రశాంతంగా కాలం గడపనిస్తారా? నా కంటి కింద నలుపు రీడింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకోవడం వల్ల వచ్చింది. ముడతలు వయసును బట్టి వస్తాయి. సైజ్‌ జీరో లాంటివి గుర్తుచేయకుండా నన్ను ప్రశాంతంగా కోరుకున్న దుస్తులు వేసుకోనిస్తారా? ‘పుష్పక విమానం’లో నాకు పొడవాటి జుట్టుందని.. ఇప్పుడు కత్తిరించుకున్నానని జుట్టుకు రంగు వేసుకోకుండా ఉండనిస్తారా?’’

‘‘నాకెంత జుట్టు ఉందన్న విషయం గురించే పట్టించుకుంటారు కానీ, నాకున్న జ్ఞానాన్ని గుర్తించరు. కెమెరాలు ఓ మనిషి వ్యక్తిత్వాన్ని కచ్చితంగా చూపించగలుగుతాయా? నేను ఎలా వంట చేస్తాను? వంటి విషయాలు అడగకుండా నన్ను ప్రశాంతంగా అర్థవంతమైన విషయాలపై చర్చించనిస్తారా? మార్పు వచ్చేలా ఏదన్నా విభిన్నంగా చేయాలని నా అంతర్గత ఆలోచనలు తహతహలాడుతున్నాయి. భౌతికంగా నేను వెళ్లిపోయేలోపు పూర్తి చేయని విషయాలు పూర్తిచేయాలనుకుంటాను. ప్రశాంతంగా నన్ను నా దారిలో నడవనిస్తారా? నా జీవితంలో ఓ మిషన్‌ను పూర్తిచేయాలనుకుంటున్నాను. కానీ, ఇతరులు కలగజేసుకోవాలనుకున్నప్పుడు ఆ మిషన్‌ను పూర్తిచేయలేను. సామాజిక మాధ్యమాల్లో లైకులు, కామెంట్లు, టీఆర్పీ రేటింగ్స్‌, బాక్సాఫీస్‌ పిచ్చి నుంచి నన్ను విముక్తురాలిని చేస్తారా? నా ఆత్మ స్వేచ్ఛగానే ఉంది. కానీ, నన్ను మాత్రం కాలం, పేరు ప్రతిష్ఠలు అనే పంజరంలో బంధించారు.’’

‘‘నా జీవితాన్ని నాకు వదిలేయండి. వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వండి. నిజం, లక్ష్యం వంటి అంశాల మధ్య బతికేందుకు అనుమతినివ్వండి. చనిపోయిన వారికి గౌరవం ఇవ్వండి.’ అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు అమల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *