శంషాబాద్‌ ఘటనపై విదేశాల్లోనూ ఆవేదన

అక్షిత ప్రతినిధి, ఇంటర్నెట్‌ డెస్క్‌: శంషాబాద్‌లో పాశవిక హత్యాచారానికి గురైన యువ వైద్యురాలి ఉదంతంపై ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. సినిమా, రాజకీయ రంగం సహా ఇతర రంగాల్లోని ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఇది ఓ ఉద్యమంగా మారింది. బాధిత కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై తెలుగు రాష్ట్రాలు, దేశ్యాప్తంగానే కాదు.. విదేశీయులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నందునే భారతను సందర్శించాలంటే భయంగా ఉందని ఓ విదేశీ మహిళ చేసిన ట్వీట్‌ ఆలోచింపజేస్తోంది. ‘భారత్‌కు వెళ్లి ఇలాంటి దారుణాలకు బలై ఇక తిరిగి రాకపోవచ్చునేమో’ అని సందేహం వ్యక్తం చేసింది ఆ మహిళ. తాజా హత్యాచార ఘటనలో నిందితుల్ని సజీవ దహనం చేయాలంటూ ఇక్కడి ఆందోళనకారులతో తన స్వరాన్ని కలిపింది. మరోవైపు పోలాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన బుడతడు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశాడు. ఇలా బాధితురాలి హ్యాష్‌టాగ్‌తో ట్విటర్‌లో అనేక మంది తమ అభిప్రాయాన్ని, ఆవేదనను పంచుకుంటున్నారు. 

పలు అంతర్జాతీయ పత్రికల్లో సైతం వైద్యురాలి ఘటనను ప్రధానంగా ప్రచురించాయి. బీబీసీ, గల్ఫ్‌ న్యూస్‌, డైలీ మెయిల్‌ వంటి ప్రముఖ సంస్థలు వార్తకు ప్రాధాన్యం ఇచ్చాయి. బాధుతురాలి కుటుంబసభ్యులు పోలీసుల్ని సంప్రదించినప్పుడు వారు ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరిని ప్రధానంగా ప్రస్తావించాయి. ఇలాంటి ఘోరాల్ని నిరోధించేలా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశాయి. ఇటు దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతీయువకులు, ప్రజాసంఘాలు బాధితురాలి కుటుంబానికి సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నిందితుల్ని వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *