‘విమానం కూల్చినవారిని శిక్షించాల్సిందే’

కీవ్‌: టెహ్రాన్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉక్రెయిన్‌ విమాన ప్రమాదంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పొరబాటుగా తాము క్షిపణి ప్రయోగించడం వల్లే విమానం కూలినట్లు ఇరాన్‌ నేడు వెల్లడించింది. ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిన ఆ దేశం.. ఆధారాలు బయటపడటంతో పొరబాటును అంగీకరించాల్సి వచ్చింది. కాగా.. ఇరాన్‌ ప్రకటనపై ఉక్రెయిన్‌ స్పందించింది. విమానం కూల్చినవారిని శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేగాక, బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

‘ప్రమాదం వెనుక నిజమేంటనేది ఈ రోజు ఉదయం తెలిసింది. కూల్చివేతకు కారణమైన వారిని ఇరాన్‌ కోర్టులకు లాగి శిక్షిస్తుందని ఆశిస్తున్నాం. అంతేగాక ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలి. వారు చేసిన తప్పునకు అధికారికంగా క్షమాపణ చెప్పాలి. ఎలాంటి అడ్డంకులు, ఆలస్యం లేకుండా దర్యాప్తు జరగాలి’ అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమర్‌ జెలెన్‌స్కీ ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.

ఇరాన్‌ బాధ్యత వహించాలి..

కాగా.. ఉక్రెయిన్‌ విమాన ఘటనలో మరణించిన వారిలో ఇరాన్‌ తర్వాత ఎక్కువ మంది కెనడా దేశస్థులే ఉన్నారు. దీంతో కూల్చివేతపై ఆ దేశం కూడా తీవ్రంగా స్పందించింది. ఘటనకు ఇరాన్‌ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ‘ఇది జాతీయ విషాదం. కెనడియన్లు అందరూ విచారంలో ఉన్నారు. విమాన కూల్చివేతపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి’ అని కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో ఓ ప్రకటనలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *