వాణిదేవిలోనే పివిని చూస్తున్నాం

ట్టభద్రులంతా పీవీ కుటుంబాన్ని గౌరవించాలి

మండలిలో మౌనంగా ఉన్న బీజేపీకి ఓటు అడిగే అర్హత లేదు

గడిచిన ఐదేండ్లలో ఏం చేశారో చెప్పాలి..

సురభికి అంతర్జాతీయ అంశాలపై, ఉద్యోగుల సమస్యలపై చక్కటి అవగాహన

ఇది పరీక్షా సమయం.. గ్రాడ్యుయేట్స్‌ ఆలోచించాలి
ఆరేండ్లలో ఏం చేశామో.. లెక్కలతో సహా చెప్పాం.. బేరీజు వేసుకోండి

ప్రతి ఓటరును పోలింగ్‌ బూత్‌కు రప్పిస్తాం
వాణీదేవి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాం..

హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి, మంత్రి గంగుల కమలాకర్‌

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

దేశ ప్రధానిగా దివంగత పీవీ నర్సింహారావు భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితుల్లో దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టి తక్కువ సమయంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. అటువంటి మహోన్నత వ్యక్తి కూతురు సురభి వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అదే మనం పీవీకి నిజమైన నివాళులర్పించినట్లు అని ఎమ్మెల్సీ ఎన్నికల హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి, మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఏ పార్టీ అని చూడకుండా శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ తెలంగాణ బిడ్డకు ప్రభుత్వం గౌరవం ఇచ్చింది. పట్టభద్రులంతా సురభి వాణీదేవిలో పీవీని చూసుకుంటున్నారు. వారంతా వాణీదేవికి ఓటు వేసి భారీ మెజార్టీలో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి గంగుల అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రచారం ఎలా సాగుతున్నది? అభ్యర్థి గెలుపునకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారన్న విషయాలపై ఆయనను ‘నమస్తే తెలంగాణ’పలకరించింది.. ఆ విశేషాలు..

ఓటరును ఎలా చేరుకుంటున్నారు? మీ కార్యాచరణ ?

సాధారణ ఎన్నికల కంటే పట్టభద్రుల ఎన్నికలకు ఎక్కువ కష్టపడాలి. చాలా మంది ఓటర్లను గుర్తించాలి. వారిని కలవాలి. పోలింగ్‌ బూత్‌కు రప్పించగలగాలి. ఇందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. బూత్‌ల వారీగా ప్రతి వంద మందికి ఒక ఇన్‌చార్జిని నియమిస్తాం. ఆ వంద మంది ఓటు వేసే వరకు ఇన్‌చార్జి బాధ్యత తీసుకుంటారు. నియోజకవర్గం, హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఓటరును కలుస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి గెలుపు ఖాయం.

వాణీదేవికే ఓటు ఎందుకు వేయాలి?

వాణీదేవి పీవీ కుమార్తెనే కాదు. గొప్ప విద్యావేత్త. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చక్కటి అవగాహన ఉంది. ఆమెను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు తనకు తెలిసినంతగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిన ఏ ఒక్క అభ్యర్థికి తెలియదు. వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే పీవీకి, వారి కుటుంబాన్ని గౌరవించిన వాళ్లమవుతాం. పట్టభద్రులంతా వాణీదేవికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్న.

ప్రశ్నించే గొంతుక అని ప్రతిపక్షాలు అంటున్నాయి.. మరీ మీ నినాదం?

ఐదేండ్లు మండలిలో ఉన్న బీజేపీ రాంచందర్‌రావు రాష్ర్టానికి చేసిందేమి లేదు. పట్టభద్రుల గురించి, నిరుపేదల సమస్యల పట్ల మండలిలో ఏనాడు మాట్లాడని రాంచంద్రరావుకు ఓటు అడిగే అర్హత లేదు. ఎప్పటికైనా ప్రశ్నించే గొంతు ప్రశ్నగానే మిగులుతుంది. ఎమ్మెల్సీగా వాణీదేవిని గెలిపిస్తే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. ముఖ్యంగా పీవీ కూతురు వాణీదేవి సాహితివేత్త, ఎక్కడ మచ్చలేని వ్యక్తిగా ప్రజలు భావించారు. వాణీదేవిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

కార్యకర్తలను, శ్రేణులను ఎలా సమన్వయం చేస్తున్నారు? ఎలాంటి సూచనలు ఇస్తున్నారు?

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు జరిగాయి. అటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తాం.. ప్రతి కార్యకర్తకు ఇది పరీక్షా సమయం. కష్టపడి కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థిని గెలిపించుకుని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వబోతున్నాం. ఇందుకు కార్యకర్తలు, శ్రేణులకు దిశానిర్ధేశం చేశాం.

చివరగా పట్టభద్రులకు మీరేమి చెబుతారు?

2014 కన్నా ముందు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఆరేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో.. పక్కా లెక్కలతో ప్రజల ముందుంచాం. లక్షా 30 వేలపైగా ఉద్యోగాలు ఇచ్చాం.. రాబోయే రోజుల్లో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *