వరంగల్ ఎంజిఎంలో బ్లాక్ ఫంగస్ కు ప్రత్యేక వార్డు

వ‌రంగ‌ల్, అక్షిత ప్రతినిధి : వ‌రంగ‌ల్‌లోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో బ్లాక్ ఫంగ‌స్ చికిత్స కోసం 50 ప‌డ‌క‌ల‌తో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన వార్డును రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు శ‌నివారం ప్రారంభించారు. ఎంజీఎం ఆస్ప‌త్రిలో ప్ర‌త్యేకంగా 800 బెడ్స్‌ను క‌రోనా చికిత్స‌కు కేటాయించిన‌ట్టు ఆయన తెలిపారు. ఇందులో ఐసీయూతో స‌హా ఆక్సిజ‌న్‌తో కూడిన‌ 650 బెడ్లు ఉన్నాయన్నారు. ప్ర‌స్తుతం ఎంజీఎంలో 506 మంది క‌రోనా బాధితులు చికిత్స పొందుతుండ‌గా ఇంకా 294 బెడ్లు ఖాళీగానే ఉన్న‌ట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలోనే ప్ర‌భుత్వ ఆస్పత్రుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెరిగింద‌న్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో ప‌నిచేసే డాక్ట‌ర్లు, సిబ్బంది స‌మ‌స్య‌ల‌పై జిల్లా క‌లెక్ట‌ర్‌, ఆస్పత్రి సూప‌రింటెండెంట్ ప‌రిష్కారానికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఎంజీఎం ఆస్పత్రిలో రోగులను ఆదుకునేందుకు ఎంద‌రో దాత‌లు ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మన్నారు. కేఎంసీ 1986 బ్యాచ్‌కు చెందిన డాక్ట‌ర్లు, కాళోజీ వైద్య విశ్వ‌విద్యాల‌యం రిజిస్ట్రార్ డాక్ట‌ర్ ప్ర‌వీణ్‌రావు రూ.20 ల‌క్ష‌ల విలువైన ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, మాస్కులు ఇవ్వ‌డం సంతోష‌దాయ‌క‌మ‌న్నారు. ఈ క‌ష్ట‌కాలంలో సేవా భావంతో ముందుకు వ‌చ్చి స‌హాకారం అందించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు దాత‌ల‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ చీఫ్ విప్‌ దాస్యం విన‌య్‌భాస్క‌ర్‌, ఎమ్మెల్యే నన్న‌పునేని నరేందర్, రాజ్య‌స‌భ స‌భ్యులు బండా ప్ర‌కాష్, ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య‌, వరంగల్ నగర మేయ‌ర్ గుండు సుధారాణి, జిల్లా క‌లెక్ట‌ర్ రాజీవ్‌గాంధీ హ‌న్మంతు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, ఎంజీఎం ఆస్పత్రి సూప‌రిండెంట్ వి.చంద్ర‌శేఖ‌ర్‌, కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ప‌లువురు వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *