వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలి

కలెక్టర్ హనుమంత రావు

సంగారెడ్డి, అక్షిత ప్రతినిధి :జిల్లాలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓ, డి ఆర్ డి ఓ ,డి పి ఓ ,వైద్య ఆరోగ్య శాఖాధికారి ,మెడికల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, మహిళా శిశు సంక్షేమ అధికారి, రెవిన్యూ డివిజనల్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపివోలు ,అంగన్వాడి సూపర్వైజర్ లతో మంగళవారం నాడు కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించడం, టీకా పై అపోహలు లేకుండా అవగాహన కల్పించడం, కరొనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలు,తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ఆరోగ్యశాఖ కరోనా మళ్ళీ ఉదృతం అయ్యే అవకాశం ఉందని అప్రమత్తం చేశారన్నారు. ప్రజలందరినీ అప్రమత్తం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం పనికి రాదని ,అందరికీ అవగాహన కల్పించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.

కరోనా సమయంలో ముందుండి పని చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. అట్టి అవకాశాన్ని జిల్లాలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకుని ఇప్పటివరకు టీకా తీసుకోకుండా ఉన్న పోలీస్ ,రెవిన్యూ పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖల సిబ్బంది కొరకు ప్రత్యేకించి బుధవారం (24.02.2021) ఒక్క రోజు మాప్ అప్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ( mop up) నకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు. ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సరైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోలేదో, వారిని గుర్తించి తప్పనిసరిగా వేసుకునేల చూడాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోకూడదని వైద్య ఆరోగ్య శాఖ సూచనలు ఉన్నాయో వారు మినహా, మిగతా అందరూ తీసుకునేలా చూడాలన్నారు. వ్యాక్సిన్ పై అపోహలు వద్దని, ఆందోళన, భయాలను వదిలి స్వేచ్ఛగా టీకా తీసుకోవాలని కలెక్టర్ కోరారు.

రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు అన్ని కౌంటర్లలో పని చేసేలా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళిక చేసుకోవాలని డిఎం ఆండ్ హెచ్ ఓకు సూచించారు.

కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని ,అదనపు కలెక్టర్లకు సూచించారు. సాయంత్రం వరకు ఆయా శాఖల హెచ్ ఓ డి లు పర్యవేక్షిస్తూ, గంట గంటకు నివేదికను కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.

మొదటి డోసు టీకా తీసుకున్న 28 రోజులకు రెండవ డోసు తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు అన్ని పాటించాలన్నారు. ఎవరికైనా ఏవేని అనుమానాలుంటే నివృత్తి చేయాలని మెడికల్ ఆఫీసర్ లకు ఆదేశించారు.
కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీకా పై ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, తహసీల్దార్లు గ్రామాలలో దండోరా ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుపాలన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 10 వేల మందికి వ్యాక్సిన్ చేశామని, ఎలాంటి సమస్యలు రాలేదని డాక్టర్ శశాంక తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మోజీ రామ్ రాథోడ్ పదోన్నతి పై వెళ్తున్నందున కలెక్టర్ అభినందనలు తెలిపారు. వారు జిల్లాకు అందించిన సేవలను, జిల్లాలో కరోనా కట్టడికి అన్ని విధాలా సహకరిస్తూ పని చేసినందుకు జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ, డి పి ఓ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *