కరీంనగర్, అక్షిత ప్రతినిధి : : రైతును రాజుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని, ప్రభుత్వం వ్యవసాయానికి సంపూర్ణ మద్దతునిస్తున్నదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆహార దినోత్సవం, మహిళా కిసాన్ దివాస్ కిసాన్ మేళా సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..రైతుల కోసం కేవీకే అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి, రైతులకు ఎన్కటి ఎవుసం సాగు దిశగా చైతన్యం కలిగించాలని సూచించారు. రోగాల్లేని సమాజాన్ని నిర్మించేందుకు సేంద్రియ సాగే మేలని ఈటల తెలిపారు. రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉండాలని సూచించారు. కెమికల్స్ వల్ల వచ్చే రోగాలను రైతులకు వివరించారు. తినే పంటల వల్లనే ఎక్కువ శాతం ప్రజలు రోగాల బారిపడుతున్నారనీ, ఎక్కువ ఖర్చు దవాఖానలకే వెచ్చిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట ఎంత తీస్తున్నామన్నది కాదనీ, ఎలా సాగు చేస్తున్నామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అందిస్తున్న రైతు బీమా, రైతుబంధు పథకాల గురించి సదస్సులో మంత్రి ఈటల వివరించారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకోవాలని, ఆర్థికాభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. జిల్లాను సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు కే విజయ, డీఎన్ఎన్ఎస్ జనార్దన్‌రెడ్డి, విజయగోపాల్రెడ్డి, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
tags : etela, krnr, farmers