రూ.22 కోట్లతో…100 పడకల ఆసుపత్రి

50 పడకలతో కోవిడ్ వార్డ్

మంత్రి కేటిఆర్

వేములవాడ, అక్షిత ప్రతినిధి :

వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 22 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆస్పత్రిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో వేములవాడ ఆస్పత్రితో కలిపి 500 పడకలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. వేములవాడ ఆస్పత్రిలో 50 పడకలతో కోవిడ్ వార్డు సిద్ధం చేశామని, అన్ని రకాల వైద్య సేవలతో పాటు మందులు కూడా సిద్ధం చేశామని తెలిపారు. ఆరోగ్య సర్వేలో జిల్లాలో జ్వరం ఉన్నవారికి 3,900 మందిని గుర్తించి కిట్లు అందజేశామన్నారు. సిరిసిల్ల తరహాలో వేములవాడలో కూడా రూ.40 లక్షల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరోనా వచ్చి తగ్గిన వారికి వస్తున్న బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, యాంటీ ఫంగల్ మందులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఇంకా వైద్య నిపుణులు సూచించిన మందులు, ఇతర వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 85 శాతం కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం దురదృష్టకరమని విమర్శించారు. కేవలం 15 శాతంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రయివేటు ఆస్పత్రులు కొనుక్కోవాలని కేంద్రం నిబంధన పెట్టిందన్నారు. ఇతర దేశాలకు టీకాలను ఎగుమతి చేయకుండా ఉంటే మన ప్రజలకు టీకాలు అందేవన్నారు. టీకాల విషయంలో రాష్ట్రాల పాత్ర లేకుండా పోయిందని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *