రాజశేఖర్‌ అక్కడ మాట్లాడకుండా ఉండాల్సింది..

  • ‘మా’ వివాదంపై స్పందించిన సుమన్‌

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) వివాదంపై నటుడు సుమన్‌ స్పందించారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన వివాదంపై స్పందించారు. ‘మా’కు రాజశేఖర్‌ ఎన్నో సేవలు చేశారని, కాకపోతే డైరీ ఆవిష్క్రరణలో ఆయన అలా మాట్లాడాల్సింది కాదన్నారు.

‘‘మా’ డైరీ ఆవిష్కరణ రోజు ‘మంచి ఉంటే మైకులో చెప్పుకుందాం. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం’ అని చిరంజీవి గారు చాలా బాగా చెప్పారు. ఆయన చెప్పినట్లే ‘మా’లో ఉన్న సమస్యలను అంతర్గతంగా చర్చించుకుని ఉంటే బాగుంటుంది. ఆ సమస్యలను పబ్లిక్‌లో చెప్పకపోవడం మంచిది. అనుకోకుండా ఆరోజు రాజశేఖర్‌ కొంచెం ఆవేశంగా మాట్లాడారు. ఆయన తప్పు కూడా ఏమి లేదు. కొన్ని సమస్యలుండి అవి ఇప్పటికీ పరిష్కారం కాకపోయే సరికి అలా స్పందించారు. ఆయన ‘మా’కు ఎంతో సేవ చేశారు. అంతేకాకుండా ‘మా’లోని అంతర్గత సమస్యలను రాజశేఖర్‌ ఆ వేడుకలో చర్చించకుండా ఉండి ఉంటే బాగుండేది. తప్పు జరిగిపోయింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి.’ అని సుమన్‌ అన్నారు.

ఇటీవల జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ వేడుకలో ఆవేశానికి గురైన రాజశేఖర్‌.. ‘మా’లో ఎన్నో సమస్యలున్నాయని, తాను ‘మా’ కోసం ఎంతో కష్టపడ్డానని, కాకపోతే సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో అసహనానికి గురైన చిరంజీవి, ఇతర సభ్యులు రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదే రోజు సాయంత్రం రాజశేఖర్‌ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *