రక్షణశాఖ భూములను బదలాయించాలి : కేటీఆర్

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ :  సికింద్రాబాద్ ప్రాంతంలోని కంటోన్మెంట్ ఏరియాలో నాగపూర్ పట్టణంతోపాటు యావత్ ఉత్తర తెలంగాణను రాష్ట్ర రాజధానితో అనుసంధానంచేసే రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణశాఖ భూములను బదలాయించాలని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్.. రాజ్‌నాథ్‌తోపాటు, కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖల మంత్రి హర్దీప్‌సింగ్‌పూరిని కలిసి రాష్ర్టానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ముందుగా రాజ్‌నాథ్‌తో భేటీ అయిన మంత్రి కేటీఆర్ రక్షణ భూముల బదలాయింపునకు సంబంధించి రెండు లేఖలను అందించారు. హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 11 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 39.40 ఎకరాల భూమి అవసరం అవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రామగుండం- హైదరాబాద్ రాష్ట్ర రహదారిలో జేబీఎస్ నుంచి తూంకుంట వరకు 19 కిలోమీటర్ల రోడ్డును విస్తరించడంతోపాటు ఇందులో నాలుగు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 66.37 ఎకరాల భూమి అవసరం అవుతుందని రక్షణశాఖ మంత్రికి వివరించారు. దేశంలో ఆర్థికాభివృద్ధి జరగాలంటే రోడ్ల నెట్‌వర్క్ అభివృద్ధి కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్తున్న విధంగానే తాము వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్సార్డీపీ) కింద రామగుండం- హైదరాబాద్, నాగ్‌పూర్- హైదరాబాద్ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇందుకోసం నగర శివార్లలోని కంటోన్మెంట్ ఏరియా భూములు అవసరమవుతాయని తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వల్ల కంటోన్మెంట్ ప్రాంతంలో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు తొలిగిపోతాయని రక్షణమంత్రికి వివరించారు. అంతేకాకుండా హైదరాబాద్‌కు ఉత్తర తెలంగాణ పట్టణాలైన కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, రామగుండం తదితర పట్టణాలకు రెడ్ నెట్‌వర్క్ పెరుగుతుందన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణశాఖ భూములను బదలాయించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే కోరిన విషయాన్ని మంత్రి కేటీఆర్ రాజ్‌నాథ్‌కు గుర్తుచేశారు. తాను రాజ్‌నాథ్‌ను కలిసి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని కోరినట్లు ఆ తర్వాత ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో శానిటేషన్ హబ్ ఏర్పాటుకు వందకోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని మంత్రి కేటీఆర్.. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖల మంత్రి హర్దీప్‌సింగ్‌పూరిని కోరారు. శానిటేషన్ హబ్ ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా డిసెంబర్ నెలలో ప్రకటిస్తుందని హర్దీప్‌సింగ్‌కు తెలిపారు. ఈ హబ్‌ద్వారా తెలంగాణకే కాకుండా ఇతర రాష్ర్టాలకు కూడా పారిశుద్ధ్యరంగంలో సమస్యలను అధిగమించేందుకు, పరిష్కారాలను కనుగొనేందుకు పరిశోధనలు కొనసాగుతాయని, పారిశుద్ధ్యరంగంలో ఆదర్శ విధానాలు, పరిశోధనలను పెంచేలా కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొన్నారు. శానిటేషన్ హబ్‌కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నదని చెప్పారు.  హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఘనవ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో అదనంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకోసం మరో రూ.400 కోట్లను స్వచ్ఛభారత్ మిషన్ లేదా, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల కిందనైనా మంజూరుచేయాలని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పూరిని కోరారు. ఇప్పటికే ప్రతిరోజూ ఏడు వేల టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నామని, జీహెచ్‌ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో సేకరిస్తున్నదని చెప్పారు. 2018లో స్వచ్ఛభారత్ మిషన్ కింద ఉత్తమ రాజధాని నగరంగా హైదరాబాద్ ఎంపికైన విషయాన్ని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రికి గుర్తుచేశారు. ప్రధాని ఇచ్చిన పిలుపుమేరకు పురపాలికలను స్వచ్ఛ పట్టణాలుగా మార్చడానికి నిబద్ధతతో పనిచేస్తున్నామని వివరించారు.  హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం కేటాయించిన నిధుల్లో కేంద్రం నుంచి రావాల్సిన రూ.254 కోట్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా హర్దీప్‌సింగ్ పూరిని మంత్రి కేటీఆర్ కోరారు. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం యునైటెడ్ కింగ్‌డం (యూకే)లోని ప్రముఖ యూనివర్సిటీతో కలిసి శిక్షణ కార్యక్రమాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నదని, ఇందుకోసం బేగంపేట ఎయిర్‌పోర్టును ఉపయోగించుకునేలా వెసులుబాటు కల్పించాలని కోరారు. మంత్రి కేటీఆర్ వెంట కేంద్ర మంత్రులను కలిసిన వారిలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులున్నారు. గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర వాణిజ్య, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రి కేటీఆర్ కలువనున్నారు.

 

 

 

tags : ktr, Delhi, Rajnadhsing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *