యాసంగి కొనుగోళ్లకు ఇబ్బందులు తలెతొద్దు

యాసంగిలో రైతులకు ఇబ్బంది లేకుండా

సజావుగా ధాన్యం కొనుగోలు

జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్గొండ, అక్షిత ప్రతినిధి : నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్ 2020-21లో రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఆదేశాల ననుసరించి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సజావుగా చేపట్టేందుకు అన్ని చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో యాసంగి సీజన్ 2020-21 ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్.పి.ఏ.వి.రంగ నాథ్,అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ తో కలిసి పౌర సరఫరాలు,మార్కెటింగ్,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, సహకార శాఖ,పోలీస్,కార్మిక శాఖ,మిల్లర్ లు,రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ లతో జిల్లా స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం యాసంగి సీజన్లో రికార్డ్ స్థాయి లో 7 లక్షల పైన మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు.మిల్లర్ లు,అందరి సహకారం తో విజయవంతంగా కొనుగోలు నిర్వహించినట్లు, ఈ యాసంగి లో కూడా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అన్ని శాఖలఅధికారులు సమన్వయంతో రైతులకు ఇబ్బంది లేకుండా సజావుగా ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ప్రతి కేంద్రంలో తేమ శాతం, తాల్ గురించి బోర్డు ప్రదర్శించాలని, తేమ, తాల్ విషయంలో రైతులను ముందే చైతన్య పరచాలన్నారు.జిల్లాలో 4,45,805 ఎకరాలు వరి సాగు చేసినట్లు, 9లక్షల 80 వేల 771 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉందన్నారు.ఇందులో 1,88,721 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం,12,050 మెట్రిక్ టన్నుల స్థానిక వినియోగం,2,18,721 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ లు కొనుగోలు పోగా,7,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా ఉన్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా యాసంగి 2020-21 ధాన్యం కొనుగోలుకు 365 కేంద్రాలు,ఐ. కె.పి ద్వారా 191,పి.ఏ.సి.ఎస్.కేంద్రాల ద్వారా 157,మార్కెటింగ్ శాఖ ద్వారా మార్కెట్ యార్డ్ లలో 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి లో కొనుగోలు కు చర్యలు తీసుకోనున్నట్లు,ట్యాగింగ్ చేసిన మిల్లులకు కోటా ప్రకారం తరలించాలని, మిల్లులకు తరలింపుకు లారీలు ఏర్పాటు చేసి రవాణాకు సమస్యలు లేకుండా ముందు జాగ్రత్త చేపట్టాలని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక, భౌతిక దూరం, మాస్కు ల వాడకం వంటి అంశాలను ప్రజలకు, ప్రత్యేకించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎండల దృష్ట్యా నీడకు పందిళ్ళ ఏర్పాటుకు, త్రాగునీటికి చర్యలు తీసుకోవాలన్నారు.డి.ఐ. జి.ఏ.వి.రంగనాథ్ మాట్లాడుతూ రైతులు నిర్ణీత నాణ్యతా ప్రమాణాల మేరకు ధాన్యం తీసుకు వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర లభించేలా పకడ్బందీగా అధికారులు,మిల్లర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు.తూకం విషయం లో,మద్దతు ధర,నాణ్యత పై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా పోలీస్,పౌర సరపరాలు, లీగల్ మెట్రా లజీ, వ్యవసాయ శాఖలతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ తనిఖీ నిర్వహించి చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైస్ మిల్లులు వద్ద సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ అన్ని కొనుగోలు కేంద్రాలలో కావలిసిన తూకం,తేమ యంత్రాలు సరఫరా, గన్నీ బ్యాగులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ననుసరించి కేంద్రాల ప్రారంభానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కేంద్రాల ప్రారంభానికి ముందే సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 17శాతానికి మించి తేమ లేకుండా ధాన్యం ఆరబెట్టి నాణ్యతా ప్రమాణాల మేరకు తేవాలని, కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని ఏ రైతు, ఏ కేంద్రానికి, ఏ రోజున ధాన్యం తేవాలో ముందస్తుగా రైతులకు వ్యవసాయ అధికారులు,రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ లు అవగాహన కలిగించాలని అన్నారు.కొనుగోలు కేంద్రంలో తడకలతో నీడకు, త్రాగునీరు, కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ప్రతి కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఆశాలను అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా పౌర సరఫరాల డి.యం. నాగేశ్వరరావు, జిల్లా సహకార అధికారి ఎస్.వి.ప్రసాద్,జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్,మిర్యాలగూడ డి.ఎస్.పి.వెంకటేశ్వర్ రావు,సహాయ పౌర సరపరాల అధికారి నిత్యానందం,రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి రమేష్, యాదగిరి,రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ లు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *