యాసంగికి…6700 కొనుగోలు కేంద్రాలు

ఇల్లంత‌కుంట‌లో 30 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి : మంత్రి కేటీఆర్

రాజ‌న్న సిరిసిల్ల, అక్షిత ప్రతినిధి :

ఇల్లంత‌కుంట మండ‌ల కేంద్రంలో 30 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని ఏర్పాటు చేస్తామని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట నుంచి ఇల్లంత‌కుంట‌కు నాలుగు లేన్ల ర‌హ‌దారితో పాటు ఇత‌ర రోడ్ల‌ను అభివృద్ధి చేస్తామ‌న్నారు. అభివృద్ధి విష‌యంలో ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారు. కొత్త పెన్ష‌న్లు, రేష‌న్‌కార్డులు కూడా త్వ‌ర‌లో అంద‌జేస్తామ‌న్నారు కేటీఆర్.
ఇల్లంత‌కుంట మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రం, వివేకానంద విగ్రహం దగ్గర సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, బస్టాండ్‌ వద్ద మహిళా సంఘ భవనం, తాసిల్‌ నూతన కార్యాలయ భవనం, రైతువేదిక, కూరగాయల అంగడిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. ఇవాళ ఒక్క‌రోజే ఇన్ని కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. కేసీఆర్ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత అసాధ్య‌మ‌నుకున్నటువంటి వాటిని సుసాధ్యం చేశాం. నేడు ఎండ‌కాలంలోనూ చెరువులు మ‌త్త‌డి దుంకుతున్నాయి. నీటి సంర‌క్ష‌ణ విష‌యంలో దేశానికే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగామ‌న్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో 6 మీట‌ర్ల మేర‌ భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయ‌న్నారు.
రైతుల‌కు పాదాభివంద‌నం :
రాజ‌రాజేశ్వ‌ర సాగ‌ర్‌, అనంత‌గిరి రిజ‌ర్వాయ‌ర్‌లో భూములు కోల్పోయిన రైతులంద‌రికీ పాదాభివంద‌నం చేస్తున్నా అని కేటీఆర్ పేర్కొన్నారు. భూ నిర్వాసితుల‌కు ఉండే చిక్కులు, ఇబ్బందులు సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు. భూ నిర్వాసితుల‌కు మంచి ప‌రిహారం ఇస్తున్నామ‌ని తెలిపారు. వీరి త్యాగాన్ని చ‌రిత్రలో ఎప్ప‌టికీ గుర్తుంటుంద‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా అన్ని వాగులు, వంక‌లు, చెరువుల‌ను నింపుకుంటున్నాం. రైతు ఆత్మ‌హ‌త్య‌లు లేని రాజ్యం కావాల‌ని సీఎం కేసీఆర్ క‌ల‌లు క‌న్నారు. రైతుబంధు రూపంలో ఎక‌రానికి రూ. 10 వేలు ఇస్తున్నాం. రైతు చ‌నిపోతే ఆ కుటుంబం రోడ్డున ప‌డొద్ద‌నే ఉద్దేశంలో రూ. 5 ల‌క్ష‌ల బీమా అందిస్తున్నాం. రైతుల రుణాలు మాఫీ చేసుకున్నాం. ఆర్థిక సంక్షోభం ఉన్న‌ప్ప‌టికీ రుణ‌మాఫీ కోసం బ‌డ్జెట్‌లో రూ. 5,250 కోట్లు కేటాయించుకున్నాం. సాగునీటి ప్రాజెక్టుల ప‌నులు శ‌ర‌వేగంగా ముందుకెళ్తున్నాయి. చెరువు మీద ఆధార‌ప‌డే ప్ర‌తి కుల‌వృత్తి విరాజిల్లుతుంద‌న్నారు. చేప‌లు ప‌ట్టే గంగ‌పుత్రులు, మ‌త్స్య‌కారులు సంతోష‌ప‌డుతున్నారు. మ‌త్స్య సంప‌ద‌తో వారి ముఖాల్లో న‌వ్వులు పూస్తున్నాయ‌న్నారు.
6700 ధాన్యం కొనుగోలు కేంద్రాలు :
యాసంగి పంట‌లో తెలంగాణ రాష్ర్టం దేశంలోనే నంబ‌ర్ వ‌న్‌గా నిలుస్తుంద‌న్నారు. వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను వీలైన‌న్ని ఎక్కువ ఏర్పాటు చేసి చివ‌రి గింజ వ‌ర‌కు కొనుగోలు చేశామ‌న్నారు. ఇప్పుడు కూడా అదే రీతిలో 6700 ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైత‌న్న బాధ‌ప‌డొద్ద‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. 5 వేల ఎక‌రాల‌కు చొప్పున ఒక రైతు వేదిక‌ను ఏర్పాటు చేశాం. ఏఈవోల‌ను నియ‌మించుకున్నాం. తెలంగాణలో వ్య‌వ‌సాయం పండుగ అయింద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. మానకొండూర్, ఇల్లంతకుంట మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన తహశీల్దార్ కార్యాలయం, రైతు వేదిక భవనం మరియు కూరగాయల మార్కెట్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *