మేధావులు విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి: కేటీఆర్‌

మేధావులు విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి: కేటీఆర్‌

తెలంగాణ అభివృద్ధి పైన జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ వికాస సమితి సదస్సులో ప్రసంగించిన మంత్రి… ప్రతిపక్షాల నిరాధార ఆరోపణలు ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత మేధావులు తిసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈరోజు తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు తెలంగాణ మేధో వర్గానికి విజ్ఞప్తి చేశారు. దశాబ్దన్నర పాటు అనేక ఉద్యమాలు పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ ప్రస్తుతం సరైన మార్గంలోనే ముందుకు వెళుతుందని.. ఉద్యమ ఆకాంక్షల మేరకే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తూ ప్రజా సంక్షేమం దిశగా వేగంగా దూసుకెళ్తున్న మంత్రి అన్నారు.

తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే ఏడు మండలాలను ఆంధ్రాలో విలీనం చేస్తూ తెరలేపిన కుట్రలను ఎప్పటికప్పుడు చేదించుకుంటూ అభివృద్ధి పథన అగ్రభాగంలో నిలుస్తున్నదని మంత్రి తెలిపారు. గతంలో ఆధిపత్య భావజాలం కలిగిన పాలకపక్షాల తో తెలంగాణ ప్రజలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంటే, మరోసారి రాష్ట్రంలోని ప్రతిపక్షాల సంకుచిత మనస్తత్వం తో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే తెలంగాణ ప్రజా కోర్టులో ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.

కేసీఆర్‌ అసాధారణ పాలన వల్లనే తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన నీళ్ళు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాల్లో సంపూర్ణ న్యాయం చేసే దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. ఒకవైపు తెలంగాణను కోటి ఎకరాల మాగానం చేయాలన్న లక్ష్యం మేరకు నూతన ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టామన్నారు.మరోవైపు తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ మంచి నీరు అందించే కార్యక్రమం దాదాపు పూర్తి కావచ్చింది అన్నారు.

తెలంగాణ కోసం ఉద్యమించిన యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో చేపట్టిన నియామక ప్రక్రియను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఇలా తాము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళుతుంటే ప్రతిపక్ష పార్టీలు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను ముందుకు సాగకుండా, నియామకాల ప్రక్రియను ఎప్పటికప్పుడు కోర్టుల్లో సవాలు చేస్తూ అడ్డంకులు సృష్టించాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ఇలా ఎక్కడికక్కడ అభివృద్ధి యజ్ఞానికి అడ్డం పడుతున్న ప్రతిపక్ష పార్టీల అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచడంలో తెలంగాణ మేధోవర్గం అండగా నిలవాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల అవినీతి అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం పైన ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన విషయాల పైన మంత్రి కేటీఆర్ సవివరంగా వివరించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాంగ్రెస్ రూపొందించినప్పుడు కేవలం 16 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేదని దాన్ని 10 రెట్లు పెంచి 160 టీఎంసీల పెంచినందువల్లనే ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం పెరిగింది అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈపీసీ విధానంలో కాంట్రాక్టర్లకు డబ్బులు దోచిపెట్టేందుకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట ప్రజల సొమ్ములను కొల్లగొట్టిన విషయాన్ని కూడా చర్చకు పెట్టాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ప్రాజెక్టులతో పాటు ప్రతి విషయం పైన ప్రతిపక్ష పార్టీ కోర్టుకు వెళ్లిందని చివరికి తెలంగాణ ఆడబిడ్డలకు అందివ్వాల్సిన బతుకమ్మ చీరలు సైతం అడ్డుకుందని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. తెలంగాణ బంగారు భవిత కోసం చేపట్టిన ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాన్ని అప్పుల చేస్తున్నదని దుష్ప్రచారం చేస్తున్నారని, అవి ప్రాజెక్టులపైన పునరుత్పాదకత కలిగిన పనులు చేస్తున్న పెట్టుబడులని,వాటికి ఖర్చు చేస్తున్న నిధులతో పోల్చుకుంటే రానున్న రోజుల్లో వాటి ప్రతిఫలం పదిరెట్లు గా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

మరోవైపు కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అవినీతికి, బంధుప్రీతికి, కుటుంబ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం అని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల దొల్లతనాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఇప్పటికే ప్రజల్లోకి టీఆర్ఎస్ పార్టీ వెళ్లిందని, ఈసారి ప్రజలంతా కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, రానున్న ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు బేగంపేట హోటల్లో జరిగిన ఒకరోజు సదస్సు కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి తెలంగాణ వికాస సమితి బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతినిధులతో పాటు తెలంగాణ మేధో వర్గం హాజరయ్యింది.

Tags: KTR , Minister KTR , Election Campaign , TRS Party , Telangana Elections 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *