మూడు స్థానాలూ తెరాస ఖాతాలోకే

రాజ్యసభ ఎన్నికల్లో ప్రకాశ్‌, లింగయ్య, సంతోష్‌కుమార్‌ గెలుపు 
  కాంగ్రెస్‌ ఏజెంటుకు చూపి ఓటేసిన స్వతంత్ర అభ్యర్థి మాధవరెడ్డి 
  ఆ ఓటు చెల్లదని తేల్చిన ఎన్నికల సంఘం 
  తెరాసకు ఓటేసిన కాంగ్రెస్‌ సభ్యులపై ఫిర్యాదును తోసిపుచ్చిన ఈసీ 

తెలంగాణలో శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మూడింటిని కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మొత్తం 107 ఓట్లు పోల్‌కాగా తెరాసకు ఊహించిన విధంగానే 97 ఓట్లు వచ్చాయి. బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌కు 33, బడుగుల లింగయ్య యాదవ్‌, జోగినపల్లి సంతోష్‌కుమార్‌లకు 32 చొప్పున ఓట్లు రాగా వారిని విజేతలుగా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. బరిలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరామ్‌నాయక్‌ 10 ఓట్లు మాత్రమే పొంది ఓటమి పాలయ్యారు. స్వతంత్ర సభ్యుడిగా ఉన్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పోలింగు సమయంలో కాంగ్రెస్‌ ఏజెంటుకు తమ ఓటును చూపించడంతో దీనిపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) ఈసీకి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఆయన ఓటును చెల్లనిదిగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో దానిని పరిగణనలోకి తీసుకోలేదు. కాంగ్రెస్‌లో గెలిచిన ఏడుగురు సభ్యులు తెరాసకు అనుకూలంగా ఓటు వేయడంపై కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయగా ఈసీ తోసిపుచ్చింది. మరోవైపు కాంగ్రెస్‌లో చేరిన తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోలేదు. శాసనసభ కమిటీ హాలులో జరిగిన ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ శుక్రవారం రాత్రి ప్రకటించారు.

తొలి ఓటు ఈటల.. చివరి ఓటు జీవన్‌రెడ్డి 
రాజ్యసభ ఎన్నికల్లో తొలి ఓటును ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ వినియోగించుకున్నారు. తర్వాత మంత్రులు, సీఎం, కాంగ్రెస్‌ సభ్యులు ఓటు వేశారు. శాసన సభ్యుడు రాజేందర్‌రెడ్డి తిరుపతి నుంచి నేరుగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చివరిగా కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఓటు వేశారు. సాయంత్రం నాలుగింటికి పోలింగు ముగిసింది. భాజపా, తెదేపా, సీపీఎంలు పోలింగుకు దూరంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *