అక్షిత ప్రతినిధి, తిరుమల : తిరుమలలో మూడు నెలల్లో వాటర్ బాటిళ్ల విక్రయాలను నిషేధిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈలోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం రాత్రి ఆయన తిరుమలలో ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, ఇతర అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తొలి దశలో రెస్ట్‌హౌస్‌ల్లో నీళ్ల బాటిళ్ల నిషేధాన్ని అమలు చేస్తామన్నారు. ప్రతి విశ్రాంతి గృహంలో నీటి క్యాన్లు ఏర్పాటుచేసి జలప్రసాదం నీటిని నింపుతామన్నారు. తాగేందుకు పేపరు గ్లాసులను అందుబాటులో ఉంచతామన్నారు. కొండపై ప్లాస్టిక్ నిషేధానికి శ్రీకారం చుట్టామన్నారు. దీనికి వీఐపీలు, భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ పాల్పడిన అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఆ కమిటీలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విచారణ నివేదిక రాగానే అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తప్పవన్నారు. బోర్డు ఏర్పడ్డాక అన్ని లోకల్ అడ్వైజరీ కమిటీలను నియమిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తన ఆధ్వర్యంలో సమావేశం జరిగిందన్నారు. 31న టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుందన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా భోజనం, నీరు, వసతి, ప్రసాదాలు, పారిశుధ్యం ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను కోరానన్నారు.
