మిర్యాలగూడ టూ కన్యాకుమారి

శ్రీవర్ధన్ …సహసపర్యాటకం 

21 రోజులు…5000 కిలోమీటర్లు … బైక్ పయనం

ప్రకృతి ప్రశాంతతో తలమునకలై                    21 రోజుల పాటు ప్రయాణం 

మిర్యాలగూడ నుంచి హంపీ, గండికోట మీదుగా కన్యాకుమారి త్రివేణి సంగమ క్షేత్రం సందర్శన 

నేడు మిర్యాలగూడకు చేరుకోనున్న శ్రీవర్ధన్      ఘన స్వాగతం పలుకనున్న డీఎస్పీ,.       రంగా శ్రీధర్, మిత్ర బృందం..

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

అతనికి బైక్ రైడింగ్ అమితమైన ఇష్టం… ఎంతటి దూరమైన బైక్ పై వెళ్లాలని ఆశ. పకృతి రమణీయతకు తోడు… మానసిక ఉల్లాసం… ఒత్తిడిని జయించేందుకు సాహస యాత్ర ఉపయుక్తంగా ఉండనుంది. మిర్యాలగూడ నుంచి జనవరి 8న బయలుదేరి …21 రోజులు…5000 కిలోమీటర్లు… బైక్ రైడింగ్ తో మిర్యాలగూడ టూ కన్యాకుమారికి చేరుకుని… మళ్ళీ స్వంత గూటికి చేరువయ్యారు. సాహస పర్యాటకానికి విపరీతమైన క్రేజీ వచ్చింది. ఇతర ప్రాంతాల ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను తెలుసుకోవడంతో పాటు ప్రకృతితో తలమునకలయ్యేందుకు యువత సాహస యాత్రలను చేపట్టేందుకు ముందుకొస్తున్నారు. తద్వారా మానసిక ఒత్తిడిని జయించడంతో పాటు ప్రకృతి ప్రేమికులవుతున్నారు.  మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, సామాజికసేవా కార్యకర్త రంగా శ్రీధర్ తనయుడు శ్రీవర్ధన్ ఈనెల 8న మిర్యాలగూడ నుంచి కన్యాకుమారికి పయనమయ్యారు. దాదాపు 21 రోజుల పాటు బైక్ పై 5000 కిలోమీటర్లు ప్రయాణించి నేడు మిర్యాలగూడకు చేరుకోనున్నారు. శ్రీవర్ధన్ కు మిర్యాలగూడ డీఎస్పీ, మిత్ర బృందం ఘన స్వాగతం పలకనున్నట్టు రంగా శ్రీధర్ తెలిపారు. తన కుమారుడికి సూచనలు, సలహాలు అందజేయడంతో పాటు యాత్రను ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. శ్రీవర్ధన్ కు చిన్నతనం నుంచే మోటార్ సైకిల్ ప్రయాణమంటే చాలా ఇష్టం. బైక్ రైడింగ్ లో ఆయన సిద్ధహస్తుడు. ఈనెల8న నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణం నుంచి బయల్దేరిన శ్రీవర్ధన్ తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని పెన్నా నది తీరంలోని గండి కోటను సందర్శించారు. ఈ ప్రాంతం మిర్యాలగూడ పట్టణం నుంచి దాదాపు 400కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. పచ్చటి పైరు పంటల నడుమ, ఆహ్లాదకరమైన వాతావరణంలో తన ప్రయాణం సాఫీగా సాగిందని శ్రీవర్ధన్ తెలిపారు. ఈ నెల 9న గండికోటలో 13వ శతాబ్దంలో నిర్మించిన గండికోట ఆలయం సందర్శన తనలో నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. ఎర్రమల కొండల నుంచి పెన్నానది పరవళ్లు ఉర్రూతలూగించిందని అన్నారు. ప్రయాణంలో అలసిపోయిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న టెంటులో విశ్రాంతి తీర్చుకునేవాడినని, ప్రతీరోజు కేవలం ఆరు నుంచి ఎనిమిది గంటల ప్రయాణం మాత్రమే నిర్దేశిత స్పీడులో మోటార్ సైకిల్ ను నడిపేవాడినని చెప్పారు. ఈనెల 11న శ్రీవర్ధన్ హంపీకి చేరుకున్నారు. బెంగళూరు నుంచి ఈ ప్రాంతం 353 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయనగర సామ్రాజ్య పాలన గొప్పతనాన్ని అద్దం పట్టే చారిత్రక కట్టడాలు, ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. హంపీలోని తుంగభద్ర నది పరవళ్లను, విరూపక్ష ఆలయాన్ని శ్రీవర్ధన్ సందర్శించారు. ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా గుర్తించబడిన హంపీ సందర్శన తనలో మానసిక ఆహ్లాదాన్ని నింపిందని శ్రీవర్ధన్ తెలిపారు. సాహస, విజ్ఞాన యాత్రల ద్వారా కొత్త ప్రదేశాలను సందర్శించడంతో పాటు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల సాధకబాధలను తెలుసుకునేందుకు వీలవుతుందని అన్నారు. ఇతరులకు సాయం చేయాలనే సేవా సుగుణాన్ని తన తండ్రి రంగా శ్రీధర్ నుంచి నేర్చుకున్నానని అన్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోలేకపోయినందుకు కాస్త బాధనిపించిందని శ్రీవర్ధన్ తెలిపారు. అయితే, గోవా పర్యటనకు వచ్చిన మిత్రులు తనను కలవడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. కర్ణాటకలోని మృదేశ్వర ఈశ్వర ఆలయాన్ని సందర్శించినప్పుడు ఎంతో మానసిక ప్రశాంతతను చవిచూశానని అన్నారు. మద్కెరీ , కూర్గు లోయల్లోని ప్రకృతి రమణీయత తనను ఎంతో ఆకర్షించిందని అన్నారు. ఆకాశమే హద్దుగా ప్రయాణాన్ని కొనసాగించానని చెప్పారు. సుదూర ప్రాంతాలను చుట్టి రావాలని తాను రెండేండ్ల కిందటే లక్ష్యాన్ని పెట్టుకున్నానని అన్నారు. ఛాంబ్ పీక్, కేరళలోని వాయినాడ్, కలికాట్, కొచ్చిన్ ప్రాంతాలను సందర్శించి 26న కన్యాకుమారికి చేరుకున్నట్టు శ్రీవర్ధన్ తెలిపారు. అంతకుముందు కొడైకెనాల్, మధుర మీనాక్షీ ఆలయాన్ని సందర్శించానని చెప్పారు. 20కిలోమీటర్లు ట్రెక్కింగ్ కు వెళ్ళినప్పుడు తనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం మరింత ఇనుమడించిందని అన్నారు. వ్యాహ్యాళి,విహారం, సాహసయాత్రలు చేసేవారిలో సానుకూల ధోరణి పెరుగుతుందని తండ్రి రంగా శ్రీధర్, తల్లి రమ్య చెప్పిన మాటలు ఎప్పుడూ తన మదిలో మెదులుతుంటాయని అన్నారు. ఇటీవలి కాలంలో ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు సైతం ఇకో టూరిజానికి అలవాటుపడుతున్నారని అన్నారు. కన్యాకుమారిలో బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం ఓకేచోటికి చేరే త్రివేణి సంగమ క్షేత్రం అద్వితీయమని అన్నారు. దక్షిణ భారత సరిహద్దులోని కన్యాకుమారి పవిత్ర యాత్రా స్థలంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. వారణాసి పరమశివుడికి నివాస స్థలంగా…కన్యాకుమారి పర్వతీదేవికి నివాసస్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. 1892లో స్వామి వివేకానంద కన్యకుమారిలో ధ్యానం చేశారు. ఈ ప్రాంతంలో నిర్మించిన వివేకానందుడి రాతి విగ్రహం,12 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంస్య విగ్రహం కన్యాకుమారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అన్నారు. చెన్నై నుంచి కన్యాకుమారి 743 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కన్యాకుమారి చివరి సరిహద్దైన ఇందిరాపాయింట్, మహాత్ముడి స్మారక చిహ్నం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. తన సాహస యాత్రను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని శ్రీవర్ధన్ తెలిపారు. కాగా, వైజాగ్ లోని గీతం విశ్వవిద్యాలయంలో శ్రీవర్ధన్ బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. సాహస యాత్రలు చేపట్టాలంటే ఆయనకు చాలా ఇష్టం. సుదూర ప్రయాణం చేపట్టాలని గత ఆరు నెలల నుంచి భావిస్తున్నారు. నాలుగో సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు ముగిసిన తర్వాత బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రయాణానికి తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యుల ప్రోత్సాహం, ప్రోత్బలం తోడైంది. శ్రీవర్ధన్ కన్యాకుమారి యాత్రకు బయల్దేరే సమయానికి గంట ముందు 43 రోజుల్లో 15 రాష్ట్రాల్లో 16వేల కిలోమీటర్లు బైక్ పై పర్యటించిన రైడర్ సద్దాం ఆయనకు పలు కీలక సూచనలు, సలహాలు అందించినట్టు రంగా శ్రీధర్ తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *