‘మహా’ పీఠంపై మళ్లీ దేవేంద్రుడు.. ఎలా సాధ్యమైంది?

అక్షిత ప్రతినిధి, ఇంటర్నెట్‌ డెస్క్‌: శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్‌ సారథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైపోయిందనుకున్నారంతా.. ఇక గవర్నర్‌ నుంచి పిలుపు.. ఆ తరువాత ప్రమాణ స్వీకారమే తరువాయి అన్నట్టుగా వార్తలు కూడా వచ్చేశాయ్‌.. నిన్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రకటనతో అందరికీ వచ్చిన క్లారిటీ దాదాపు ఇదే. కొన్ని గంటలు గడిచాయి. ఇంకా తెల్లారలేదు.. కట్‌ చేస్తే.. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో యావత్‌ దేశంలో సంచలనం కలిగింది. ఏ పార్టీకీ తగిన సంఖ్యాబలం లేక రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంలో భాజపా ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందనే సందేహాలు.. ఊహాగానాలు.. ఇలా ఎన్నెన్నో.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన పరిణామాల మధ్య ఎన్సీపీ చీలిక వర్గం (అజిత్‌ పవార్‌)తో కలిసి మహారాష్ట్రలో మళ్లీ దేవేంద్ర ఫడణవీసే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ వాస్తవికత ఆధారంగానే ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలని.. సహనమనేది ఓ ఆయుధమని చెప్పిన ఫడణవీస్‌కు క్లీన్‌ ఇమేజ్‌ ఉంది. అంతేకాకుండా సవాళ్లను అవకాశాలుగా మలచుకొనే నైపుణ్యమే ఆయన్ను మళ్లీ మరాఠా పీఠంపై నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అనేక మలుపులు తీసుకున్న రాజకీయంలో.. భాజపాకు చివర్లో ఎన్‌సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ నుంచి మద్దతు లభించడంతో భాజపా తిరిగి పీఠాన్ని అధిష్టించగలిగింది. దీంతో మహారాష్ట్ర సమకాలీన రాజకీయాల్లో తనదే పైచేయి అని దేవేంద్ర ఫడణవీస్‌ మరోసారి నిరూపించుకున్నారు. రాజకీయ వ్యూహం, ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్‌షాల అండతో మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

ఆనాటి ఆడంబరం లేదు.. ఎంతో రహస్యంగా..

2014లో తొలిసారిగా దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముంబయిలోని వాంఖడే మైదానం కిక్కిరిసింది. తన కుటుంబ సభ్యులతో పాటు వేలాదిమంది భాజపా కార్యకర్తలు, మద్దతుదారుల మధ్య ఎంతో కోలాహలంగా సాగిన ఆయన ప్రమాణస్వీకారోత్సవంలో ఈసారి ఎలాంటి అట్టహాసమూలేదు. ఆడంబరమూ లేదు. కేవలం కొద్ది మంది మధ్యే ఎంతో రహస్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితికి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలే కారణం. అక్టోబర్‌ 21న మహారాష్ట్రలో ఎన్నికలు జరగ్గా.. అదే నెల 24న ఫలితాలు వెల్లడయ్యాయి. మళ్లీ దేవేంద్ర ఫడణవీసే సీఎం అవుతారంటూ భాజపా అగ్ర నేతలంతా ఎన్నికల ప్రచారంలో చెప్పారు. దశబ్దాల కాలం నాటి తన మిత్రపక్షం శివసేనతో కలిసి 164 స్థానాల్లో పోటీచేసిన భాజపా 105 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర పీఠంపై అధికారానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 145. ఆ రెండు పార్టీల కూటమికి అధికారానికి కావాల్సిన సంఖ్యాబలం సమకూరినా సీఎం పీఠం పంపకాలపై శివసేన పెట్టిన మెలికతో ఆ రెండు పార్టీల దశాబ్దాల కాలం నాటి నెయ్యంలో మొదలైన కయ్యాలు తారస్థాయికి చేరాయి. చివరకు సీఎం పీఠమే లక్ష్యంగా శివసేన ఎన్సీపీ-కాంగ్రెస్‌తో జతకట్టింది. రాష్ట్రంలో అధికార పక్షంలో ఉంటూనే శివసేన భాజపాపై ‘సామ్నా’లో తీవ్ర విమర్శలు చేయడం, ముంబయి మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల స్నేహానికి బీటలు అప్పుడే ఏర్పడ్డాయి. ఈ క్రమంలో నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ కూటమిలోని అంతర్గత కలహాలు ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తారస్థాయికి చేరాయని చెప్పొచ్చు.

ఫడణవీస్‌ నేపథ్యమిదీ..

ఆరెస్సెస్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న నాగ్‌పుర్‌లోనే దేవేంద్ర ఫడణవీస్‌ జన్మించారు. ఆయన తండ్రి  గంగాధర్‌ ఫడణవీస్‌ కూడా ఆరెస్సెస్‌లో క్రియాశీలకంగా ఉండేవారు. దీంతో ఆ సిద్ధాంతాలపై ఫడణవీస్‌ ప్రభావితమయ్యారు. ఫడణవీస్‌ నాగ్‌పుర్‌ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడు. అంతేకాకుండా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ కూడా చేశారు.   1990లలో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఫడణవీస్‌.. 1992, 1997లలో నాగ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మేయర్‌గా గెలుపొందారు. దేశంలోనే రెండో యువ మేయర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. 1999 నుంచి నాగ్‌పుర్‌ సౌత్‌ వెస్ట్‌ స్థానం నుంచి భాజపా తరఫున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంఘ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు ఆయనకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. గత ఐదేళ్ల పాలనలో క్లీన్‌ ఇమేజీని సంపాదించారు. కొందరు తన మంత్రివర్గ సహచరులపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఎంతో నేర్పుతో వ్యవహరించారు. ఫడణవీస్‌ సతీమణి అమృత బ్యాంకు ఉద్యోగి, నేపథ్య గాయకురాలు, కుమార్తె దివిజ ఓ పాఠశాలలో చదువుతోంది. తల్లి సరిత గృహిణిగా ఉన్నారు.

దేవేంద్రుడిది క్లీన్‌ ఇమేజ్‌

తొలిసారి మహారాష్ట్ర సీఎంగా ఐదేళ్ల పాటు ఉన్న దేవేంద్ర ఫడణవీస్‌ క్లీన్‌ ఇమేజ్‌ కలిగిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా సహచర మంత్రులు అవినీతికి పాల్పడిన సమయాల్లో ఎలాంటి ఉపేక్ష ప్రదర్శించకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాల నుంచి అండదండలు లభించాయి. వారి సహకారంతో మరింత ఉత్సాహంతో పనిచేసిన ఫడణవీస్‌ రాష్ట్రంలో పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చేలా చక్రం తిప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు సంపాదించి తనపై అధిష్ఠానం ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. తెలివైన రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తూ రాజకీయ ప్రత్యర్థుల్ని మట్టికరిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *